పాలన నచ్చితే ప్రజలే గెలిపిస్తారు!
ABN , Publish Date - May 05 , 2026 | 04:28 AM
పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని, లేకుంటే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనేందుకు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
లేదంటే వారే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారు
గెలిచిన పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని, లేకుంటే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనేందుకు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఆయన సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును బలంగా కోరుకున్నారు. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని, పశ్చిమ బెంగాల్‌లో ప్రజల మనసును గెలుచుకుంది. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు’ అని పవన్ పేర్కొన్నారు. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత, సీఎం రంగసామికి శుభాకాంక్షలు చెప్పారు. తమిళనాడు, కేరళ ప్రజలు మార్పును కోరుకున్నారని పవన్ అన్నారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయం సాధించిన విజయ్‌ను, కేరళలో గెలిచిన యూడీఎఫ్ కూటమి నాయకులను అభినందించారు.