Share News

అండగా ఉండి ఆదుకుంటాం

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:48 AM

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంత రాయులు (53) కుటుంబానికి అండగా ఉండి, అన్నివిధాల ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.

అండగా ఉండి ఆదుకుంటాం

  • పార్టీ క్రియాశీల సభ్యుడి కుటుంబానికి పవన్‌ భరోసా

కృత్తివెన్ను, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంత రాయులు (53) కుటుంబానికి అండగా ఉండి, అన్నివిధాల ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామంలో ఆయన పర్యటించారు. తొలుత, గతేడాది ఆగస్టు 3న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వసంత రాయులు ఇంటికి వెళ్లి, ఆయన ఫొటో వద్ద నివాళులు అర్పించి, ఆయన భార్య నాగ పుష్పవతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ఓదార్చారు. ప్రమాదంలో వసంత రాయులుకు బ్రెయిన్‌ డెడ్‌ అయినపుడు అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను అభినందించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున క్రియాశీల సభ్యునికి ఇచ్చే రూ. 5 లక్షల బీమా చెక్కును పవన్‌ ఆ కుటుంబ సభ్యులకు అందించారు. కుమారుడు సీతారామరాజుకు ఉద్యోగ అవకాశం కల్పించి, కుటుంబానికి అండగా ఉండాలని కలెక్టర్‌ బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌లకు సూచించారు. కుమార్తె జాహ్నవికి వినికిడి లోపంతో పాటు మాటలు రావని తెలుసుకొని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు నుంచి వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించారు. తర్వాత పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అవయవదానం ఆదర్శనీయమన్నారు. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. పెడన నియోజకవర్గంలో కొన్ని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ తన దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌, ప్రభుత్వ విప్‌ బొమ్మిడి నాయకర్‌, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు పాల్గొన్నారు.

నేడు కోటప్పకొండకు పవన్‌కల్యాణ్‌

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గురువారంపల్నాడు జిల్లా కోటప్పకొండకు రానున్నారు. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని పూజల అనంతరం కోటప్పకొండ-కొత్తపాలెం రహదారిని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పవన్‌ పర్యటన ఏర్పాట్లను జేసీ సంజనాసింహా, ఎస్పీ బి.కృష్ణారావు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్రకార్యదర్శి సయ్యద్‌ జిలాని, చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజరమేశ్‌ బుధవారం పరిశీలించారు.

Updated Date - Jan 22 , 2026 | 03:48 AM