Share News

మోదీ నాయకత్వం... దేశ ప్రగతికి చోదకశక్తి

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:36 AM

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం దేశ ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తోందని జనసేన నాయకులు పేర్కొన్నారు. మోదీ 12ఏళ్ల పాలన ప్రతి పౌరుడిలో భరోసాను నింపిందని.....

మోదీ నాయకత్వం... దేశ ప్రగతికి చోదకశక్తి

  • భారత ప్రజలను ఏకం చేసే దిశగా పవన్‌ అడుగులు

  • జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రశంసలు

  • ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ పేరుతో హస్తినలో సమావేశం.. ఐదు తీర్మానాలకు ఆమోదం

న్యూఢిల్లీ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం దేశ ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తోందని జనసేన నాయకులు పేర్కొన్నారు. మోదీ 12ఏళ్ల పాలన ప్రతి పౌరుడిలో భరోసాను నింపిందని, ఆయన అడుగుజాడల్లో తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. ‘నేషన్‌ ఫస్ట్‌’ నినాదంతో భారతీయలందరినీ ఏకంచేసే దిశగా అడుగులు వేశారని కొనియాడారు. విభజనవాద శక్తులపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను రాజధాని సాక్షిగా చాటారని తెలిపారు. సోమవారం ఢిల్లీలో జనసేన నిర్వహించిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశంలో ఐదు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. తొలుత వందేమాతర గీతాలాపన అనంతరం పవన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. వికసిత్‌ భారత్‌ సాధన దిశగా ప్రధాన మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తున్న తీరు, నేషన్‌ ఫస్ట్‌ దిశగా సిద్థాంతాల పరిరక్షణ, రెండేళ్ల కూటమి పాలనలో ఏపీ పునర్నిర్మాణం, జనసేన 12ఏళ్ల ప్రస్థానం, జెన్‌ జీ తదితర అంశాలపై ఏపీకి చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు కేరళం, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


5 తీర్మానాలకు ఆమోదం

ఈ భేటీలో ఐదు తీర్మానాలను జనసేన నేతలు ఆమోదించారు. ‘వికసిత్‌ భారత్‌: ఆకాంక్షల నుంచి విజయాల వైపు’ అనే తీర్మానాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఏపీఎంఎ్‌సఐడీసీ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు బలపరిచారు. రెండో తీర్మానాన్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రతిపాదించారు. ‘నేషన్‌ ఫస్ట్‌’ సిద్ధాంతాన్ని జనసేన బలంగా నమ్ముతోందని ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఈ తీర్మానాన్ని బలపరిచారు. ‘సంక్షోభం నుంచి నమ్మకం వైపు: ఏపీలో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధ్థి’ అంశంపై మూడో తీర్మానాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రతిపాదించగా ఏపీ తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాలవలస యశస్వి బలపరిచారు. ‘జనసేన పార్టీ పుష్కర కాల ప్రస్థానం: త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం’ అనే అంశాన్ని నాలుగో తీర్మానంగా తెలంగాణ నాయకురాలు పి.శిరీష ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఏపీ సృజనాత్మక, జానపద కళల అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య బలపరిచారు. ‘యువత ఆకాంక్షలను జనసేన అర్థం చేసుకొంటుంద’ంటూ అహుడా ఛైర్మన్‌ టి.సి. వరుణ్‌ ఐదో తీర్మానాన్ని ప్రతిపాదించగా నటుడు తనీశ్‌ బలపరిచారు.

వీర జవాన్లకు నివాళులు

దేశ సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే జాతీయ యుద్ధస్మృతి స్మారకాన్ని (నేషనల్‌ వార్‌ మెమోరియల్‌)ను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సందర్శించారు. అమర స్థూపం వద్ద వీర జవాన్లకు పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర జవాన్‌ జీఎన్‌ఆర్‌ సతీశ్‌ తదితరుల పేర్లను చెక్కిన ఫలకాలకు పవన్‌ నివాళులు అర్పించారు. శౌర్యచక్ర రాజ్‌కుమార్‌, హవల్దార్‌ అరుణ్‌ కుమార్‌ పేర్ల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం డిజిటల్‌ బుక్‌లో పవన్‌ సంతకం చేశారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్‌, ఎంపీలు తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, వల్లభనేని బాలశౌరి, ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌తో కలిసి మంత్రి మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘దేశభక్తి, సమైక్యత రాబోయే తరాలకు చాలా అవసరం. దాన్ని జనసేన పార్టీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం-సేన ప్రస్థానం’ కార్యక్రమాన్ని నిర్వహించాం’’ అని మనోహర్‌ తెలిపారు. అంతకుముందు ‘జాతీయ సమైక్యత కోసం-సేన ప్రస్థానం’ సమావేశంలో రాష్ట్ర మంత్రి దుర్గేశ్‌తోపాటు పలువురు పార్టీ నేతలు మాట్లాడారు. జనసేన ఒక బలమైన సిద్ధాంతంతో పుట్టిన పార్టీ అని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ కొన్ని శతాబ్దాలపాటు దేశంలో నిలిచి ఉంటుందని చెప్పారు.

5.jpg

Updated Date - Jun 16 , 2026 | 04:36 AM