Share News

తాగునీటి పథకాలకు అమరజీవి పేరు

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:18 AM

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌ అన్నారు. సోమవారం అమరావతిలో పొట్టి శ్రీరాము లు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తాగునీటి పథకాలకు అమరజీవి పేరు

  • ఆయన పేరిటే ‘జల జీవన్‌ మిషన్‌’ పనులు

  • ఈ గడ్డపై నీళ్లు తాగే ప్రతి ఒక్కరూ పొట్టి

  • శ్రీరాములు త్యాగం గుర్తుంచుకోవాలి: పవన్‌

తుళ్లూరు, మార్చి 16 (ఆంద్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌ అన్నారు. సోమవారం అమరావతిలో పొట్టి శ్రీరాము లు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం ఇది. ఈ గడ్డపై నీళ్లు తాగుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగం గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలకు ‘అమరజీవి జలధార’ అని నామకరణం చేశాం’’ అని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ట్రస్ట్‌ ఇక్కడ ఏర్పాటు చేసిందని వివరించారు. ‘‘అమరజీవి జలధార పథకం ద్వారా ఇప్పటికే ఐదు జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లు ఖర్చు చేసి ఐదు మెగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులను ప్రారంభించాం. తద్వారా వచ్చే 30 ఏళ్లలో ఒక 1.21 కోట్ల మంది దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ. 9,355 కోట్లతో మరో ఏడు మెగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న మూడు వేల ఆవాసాల్లో సింగిల్‌ విలేజ్‌ స్కీం కింద చేపట్టనున్నాం. రూ. 1,814 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నాం. అన్ని తాగు నీటి పథకాలను ‘అమరజీవి జలధార’ పేరిట ముందుకు తీసుకువెళ్తాం’’ అని పవన్‌ వెల్లడించారు.


స్మృతివనం ప్రత్యేకతలివీ

అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్టుకు కేటాయించిన 6.80 ఎకరాల భూమిలో రూ.150 కోట్ల అంచనాతో పొట్టి శ్రీరాములు స్మృతివనం తొలి దశ పనులను రికార్డు సమయంలో పూర్తిచేశారు. 58 అడుగుల భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్‌ స్ట్రక్చర్‌ను వాడారు. విగ్రహం కింద మరో 60 అడుగుల ఎత్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పైభాగానికి నడుచుకుంటూ వెళ్లి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నలుదిక్కులా చూసి ఆశ్చర్యపోయారు. రెండో దశ పనులను కూడా రికార్డు సమయంలో పూర్తి చేయాలన్నారు.

హైలైట్స్‌

  • సభ ప్రారంభానికి ముందు అమరావతి అభివృద్ధి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో చేపట్టబోయే కార్యక్రమాలపై ఏవీ ప్రదర్శించారు.

  • తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పోస్టల్‌ కవర్‌ను సీఎం, మంత్రులు ఆవిష్కరించారు.

  • అమరజీవి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన దృశ్య మాలిక విశేషంగా ఆకట్టుకుంది.

  • త్యాగ శిల్పం ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు, ప్రజలు అమరావతికి తరలివచ్చారు.

  • పవన్‌ కల్యాణ్‌ పేరును మంత్రి లోకేశ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అని, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేశ్‌ను ‘మా రౌడీ రాకేశ్‌’ అని సరదాగా పలుమార్లు వ్యాఖ్యానించగా ప్రజలు హర్షధ్వానాలు చేశారు.


ఆకట్టుకున్న సైకత శిల్పం

అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఇసుక తిన్నెపై జీవం పోసిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకున్నది. ఒకవైపున జాతీయ జెండా, దాని కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిత్రపటం, మరోవైపు పోరాటయోధుల మధ్య నిర్మలంగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న అమరజీవి సైకత శిల్పం సభకు హాజరైన వారిలో స్ఫూర్తి నింపింది.

Untitled-5 copy.jpg

Updated Date - Mar 17 , 2026 | 06:21 AM