కార్యకర్త కష్టాన్ని గుర్తిద్దాం
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:33 AM
‘పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకొనేవారు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతగా మారి పనిచేయాలి.
పార్టీకి లక్షల మెదళ్లను కదిలించేవాళ్లు కావాలి
జనసేన పార్టీ భావజాలం చాలా బలమైనది
అందుకే తమిళనాడు, కర్ణాటక నుంచి ఆహ్వానం
జనసేన రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం కాదు
యువశక్తి అనే ఇంధనం మీదే పార్టీ నడుస్తోంది
పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం
రూ.2 కోట్లు విరాళం అందించిన అధినేత పవన్
అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ‘పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకొనేవారు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతగా మారి పనిచేయాలి. అప్పుడే వారు సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారు’ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్న ఆయన కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్ల విరాళం చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి మనోహర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన ఐదో విడత కియ్రాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి మొదలవుతుందని, పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఒకవారం ముందు నుంచే ప్రారంభమవుతుందని పవన్ తెలిపారు. ‘ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధించాలంటే నిబద్ధత, నిజాయతీ కలిగిన నాయకత్వం చాలా అవసరం. జనసేన పార్టీకి వందలు, వేల మంది అవసరం లేదు. లక్షల మెదళ్లను కదిలించే వాళ్లు కావాలి. అలాంటివాళ్లు పదిమంది ఉన్నా ఈ సమాజంలో మార్పు తీసుకురావచ్చు. జనసేన పార్టీ భావజాలం చాలా బలమైనది. 21వ శతాబ్దానికి ఇది రైట్ ఐడియాలజీ. ఈరోజు మనల్ని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు ఆహ్వానించడానికి కారణం మన భావజాలమే. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడేవారికి సముచిత స్థానం కల్పించాలి. ఇందులో కులం, మతం, ప్రాంతాలను పక్కనపెట్టాలి. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తాం. జనసైనికుడికి, పార్టీ నాయకులకు మధ్య సమన్వయకర్తగా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, కొత్త రక్తాన్ని తీసుకొచ్చి, సభ్యత్వ నమోదు చేయించే వారిని సాధక్‌గా, జనసేన చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేధో సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా వ్యవహరిస్తాం’ అని పవన్ పేర్కొన్నారు. ఇకనుంచి పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఉద్యమి మెంబర్ షిప్‌గా ప్రకటిస్తున్నామని తెలిపారు.
ఒక ప్రాంతానికి పరిమితమవ్వం
‘మొన్న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేను వెళ్లి ప్రచారం చేయకపోయినా, ఎన్నికల్లో పార్టీ నిలబడాలి, మన గళం తెలంగాణలో వినిపించాలనే ఆకాంక్షతో పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలుపొందారు. అది చిన్న గెలుపే కావచ్చు.. కానీ అది మార్పునకు బలమైన సంకేతం. జనసేన పార్టీ ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. పార్టీకి ఆయువు పట్టు యవత. వాళ్ల శక్తి అనే ఇంధనం మీదే పార్టీ నడుస్తోంది. బాధ్యతయుతమైన యువతను నాయకత్వం వైపు తీసుకెళ్లమే లక్ష్యం’’ అని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా గత ఏడాది అత్యధిక సభ్యత్వాలు చేసిన వారి సమక్షంలో ఆదివారం ఉదయం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారితో పవన్ కాసేపు సరదాగా గడిపారు. ఆప్యాయంగా పేరుపేరునా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి స్వయంగా అల్పాహారం వడ్డించారు. కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కల్యాణం శివశ్రీనివాస్ పాల్గొన్నారు.