Share News

ప్రకృతితో కలసి ఎదుగుదాం

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:32 AM

ఏ దేశమైతే ప్రకృతితో కలసి ఎదుగుతుందో... ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుంది....

ప్రకృతితో కలసి ఎదుగుదాం

  • నగర వనాలు పట్టణాలకు గ్రీన్‌ లంగ్స్‌

  • 36 కోట్లతో 18 ఎకో పార్కులు...

  • వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

  • పాల్గొన్న మంత్రులు ఆనం, సత్యప్రసాద్‌, సవిత

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘ఏ దేశమైతే ప్రకృతితో కలసి ఎదుగుతుందో... ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజం ప్రాజెక్టులను బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్‌ వర్చువల్‌గా ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో మంత్రులు రామనారాయణరెడ్డి, సత్యప్రసాద్‌, సవిత వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్‌ లంగ్స్‌లా పని చేస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ నిధులతో పాటు స్థానిక నిధులు సమకూర్చుకుంటూ రూ.36 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశాం. ఒక్కో నగర వనాన్ని దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.2 కోట్ల ఖర్చుతో నిర్మించాం. కోడూరు, కైలాసగిరి, మదనపల్లెలో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశాం. ఇందులో పక్షుల ఆవాసాలు, బోటింగ్‌, కయాకింగ్‌(చిన్న పడవలు నడపడం), ట్రెకింగ్‌ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్‌ జిమ్‌లు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను అందుబాటులోకి తెచ్చాం’ అని తెలిపారు.

నగర వనం అద్భుతం: ఆనం

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ... ‘నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని నగర వనం పచ్చదనం, ప్రశాంతతో పాటు అత్యాధునిక వసతులతో ఎంతో అద్భుతంగా ఉంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఈ పార్కుతో అనుసంధానం చేసి, పార్కును, గుట్టను కలిపి ట్రెకింగ్‌ పాయింట్‌గా అభివృద్ధి చేయాలి’ అని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సూర్యప్రకాశ్‌ రెడ్డి, గౌతు శిరీష, జయనాగేశ్వరరెడ్డి, పార్థసారథి, షాజహాన్‌ బాషా, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌దండే పాల్గొన్నారు.

సారథుల సమాచార సేకరణ విజయవంతం చేయాలి: పవన్‌

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. ప్రతి పార్లమెంట్‌ కేంద్రంలో పార్టీ వీర మహిళలు, జనసైనికులు నుంచి దరఖాస్తుల స్వీకరణ, సమాచార క్రోడీకరణ ప్రక్రియలు సాగుతున్న విధానాన్ని తెలుసుకున్నారు. కేంద్ర కార్యాలయం నిర్దేశించిన విధివిధానాలను అనుసరించాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా చేస్తున్న ఈ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. 29వ తేదీన సమాచార సేకరణ ప్రక్రియ మొదలైందన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించామని చెప్పారు.

Updated Date - Jul 02 , 2026 | 03:32 AM