Share News

శంఖవరంలో పెద్ద పులి సంచారం

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:45 AM

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో ‘హనుమాన్‌’ ప్రాజెక్ట్‌ బృందాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అప్రమత్తం చేశారు.

శంఖవరంలో పెద్ద పులి సంచారం

  • రంగంలోకి 10 ‘హనుమాన్‌’ బృందాలు

  • ప్రజలు భయాందోళన చెందొద్దు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో ‘హనుమాన్‌’ ప్రాజెక్ట్‌ బృందాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అప్రమత్తం చేశారు. గత నెల కూర్మాపురం వద్ద బంధించిన పులి మెడలో రేడియో కాలర్‌ వేసి, అడవిలో వదిలిపెట్టగా అది తిరిగి జనావాసాల వైపు వస్తోందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. రేడియో కాలర్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ సందేశంతో పులి సంచారం గురించి తెలుసుకున్న అధికారులు ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే హనుమాన్‌ బృందాలను ఆయన అప్రమత్తం చేశారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేసి, దాన్ని మరోసారి బంధించి విశాఖ జూ పార్కులో వదలాలని అటవీ అధికారులను పవన్‌ ఆదేశించారు. ఇందుకోసం రాజమండ్రి చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఆధ్వర్యంలో 10 హనుమాన్‌ బృందాలను ప్రత్యేకంగా నియమించారు. ట్రాకింగ్‌ సిస్టమ్‌ సందేశాల ఆధారంగా పులి జనావాసాల మధ్యకు రాక ముందే సురక్షితంగా పట్టుకోవాలని, కదలికలపై సమీప ఆవాసాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణనష్టం, జంతునష్టం కలగకుండా ఈ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పీసీసీఎఫ్‌ చలపతిరావుకు అప్పగించారు. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, హనుమాన్‌ బృందాలు సమర్థంగా పని చేస్తున్నాయని, ప్రజలు సంయమనంతో వ్యవహరించి, అటవీసిబ్బందికి సహకరించాలని పవన్‌ కోరారు.

Updated Date - Mar 16 , 2026 | 04:46 AM