Deputy CM Pawan Kalyan: గత ప్రభుత్వంలో వేధింపులే
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:08 AM
గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను అనేక రకాలుగా వేధింపులకు గురిచేసిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలుకే విద్యుత్...
పారిశ్రామికవేత్తలను వైసీపీ నాయకులు భయపెట్టారు
సమీక్షల పేరుతో విద్యుత్ ఒప్పందాలు ఆపేశారు
గ్రీన్ అమ్మోనియం ఉత్పత్తితో ప్రపంచపటంలోకి రాష్ట్రం ప్రగతి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను అనేక రకాలుగా వేధింపులకు గురిచేసిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష పేరుతో అనేక ఒప్పందాలను నిలిపివేసిందన్నారు. దీనివల్ల ప్రభుత్వం అదనంగా సొమ్ములు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. చివరకు విదేశీ సంస్థలను కూడా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కియా సంస్థ ప్రతినిధులను బెదిరించారని పవన్ ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులను నాటి ప్రభుత్వం వేధించిందని, తమ ప్రభుత్వం అలా చేయదని, పెట్టుబడిదారులకు అండగా ఉంటూ వారికి భరోసా ఇస్తోందని పేర్కొన్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌లో భారీ యంత్ర పరికరాల ఏర్పాటును బటన్ నొక్కి ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రం గమ్యస్థానం
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంటు ఏర్పాటు ఆనందంగా ఉంది. చెలమలశెట్టి అనిల్, కొల్లి మహేశ్ సహకారంతో ఏఎం గ్రీన్‌కోను స్థాపించారు. గత వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయకత్వంలో పారిశ్రామికవేత్తలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నాం. 495 ఎకరాల్లో 15 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. గ్రీన్ అమ్మోనియా కంపెనీ ఏర్పాటు దశలో 8 వేల మందికి, పనుల సమయంలో 1500 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రధాని మోదీ కేంద్రంలో, చంద్రబాబు రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధనంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికిగాను ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చాం. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి రాష్ట్రం గమ్యస్థానం కావాలి. కాలుష్యరహిత ఇంధన ఉత్పత్తిలో ఇదొక మైలురాయి. ఎరువులు, విద్యుత్ తయారీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్‌ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా దోహదం చేస్తాయి. పిఠాపురం ప్రాంతంలో సముద్రం తరచూ ముందుకు వచ్చి తీవ్ర నష్టం జరుగుతోంది. 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రత వ్యత్యాసం కనిపించినా దాని ప్రభావం పడుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఇలా జరుగుతోంది. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.