Share News

భూగర్భ జలాలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:59 AM

జలమే జీవం.. జీవమే జల సంరక్షణకు మూలం.. అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యల నుంచి వాగులు....

భూగర్భ జలాలను కాపాడుకోవాలి

  • ఉపరితల జలాలతో పాటు తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాలి

  • అప్పుడే భవిష్యత్తు తరాలకు భరోసా

  • ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపు

అమరావతి/విజయవాడ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘జలమే జీవం.. జీవమే జల సంరక్షణకు మూలం.. అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యల నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. మంగళవారం విజయవాడ కానూర్‌ ఏపీ ఎస్‌ఐఆర్‌డీ సంస్థలో ఏర్పాటుచేసిన ‘గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం’ వర్క్‌షాపును ఆయన ప్రారంభించి, మాట్లాడారు. భూమిపై మనిషికి అవసరమయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉందని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని స్పష్టం చేశారు. ‘నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీ దేశంలోనే ముందు వరుసలో ఉందంటే.. సమృద్ధిగా ఉన్న నీటి వనరులే కారణం. అలాంటి నీటిని సంరక్షించుకునే సవాల్‌ ఇప్పుడు మనందరి ముందుంది. ఉపరితల జలాలతో పాటు తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనిపై ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి సంరక్షణతో పాటు వృథా అయ్యే నీటిని కాపాడుకునే చర్యలను వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మనం భరోసా ఇచ్చినట్లు అవుతుంది’’ అని పవన్‌ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికీ తగినంత తాగునీరు అందించాలనే ఆశయానికి క్షేత్రస్థాయిలో ఎన్నో అవరోధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు ఎక్కువగా కాలుష్యం బారిన పడుతోందని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి శిఖర గ్రామా ల్లో వేసవిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు వాటర్‌ షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘100 రోజుల నీటి వినియోగ డైరవ్‌’ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 6నుంచి జూలై 14 వరకు చేపట్టిందని పవన్‌ తెలిపారు. దీనిలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ జలాలు పెంచడం, నీ టి వృథాను అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వర్క్‌షాపులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, పీసీబీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, ఏపీ ఎస్‌ఐఆర్డీ కమిషనర్‌ ముత్యాల రాజు, జేడీ కేఎస్‌ వరప్రసాద్‌, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 03:59 AM