సీమకు క్యాన్సర్ గడ్డ జగన్
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:10 AM
‘జల యజ్ఞం ను ధన యజ్ఞంగా మార్చి మట్టి పనుల పేరుతో రూ.1000 కోట్లు దోచేసి, ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించి, తన జన్మభూమికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్‌రెడ్డి’ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు.
జన్మభూమికి వెన్నుపోటు పొడిచారు
త్వరలో సీమకు హైకోర్టు బెంచ్: పట్టాభి
కడప, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘జల యజ్ఞం ను ధన యజ్ఞంగా మార్చి మట్టి పనుల పేరుతో రూ.1000 కోట్లు దోచేసి, ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించి, తన జన్మభూమికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్‌రెడ్డి’ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. ఆయన గురువారం కడపలో విలేకరులతో మాట్లాడారు. ‘రాయలసీమకు క్యాన్సర్ గడ్డ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ అనేది నూటికి నూరుపాళ్లు నిజం. గత ఎన్నికల్లో క్యాన్సర్ గడ్డను తొలగించే కార్యక్రమం దాదాపుగా చేశాం. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ ప్రాంతం నుంచి తొలగిస్తారు. జగన్ కడప జిల్లాకు, రాయలసీమకూ పైసా లబ్ధి చేకూర్చిన దాఖలాల్లేవు. చంద్రబాబు సారథ్యంలో, లోకేశ్ కృషి వల్ల ఇప్పుడు సీమకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బ్రహ్మణి స్టీల్స్ పేరుతో వైఎ్‌స హయాంలో భూములు దోచుకున్నారు. వాటిని అడ్డుపెట్టుకొని రూ.వందల కోట్ల రుణాలు పొంది వాటిని షెల్ కంపెనీల ద్వారా తరలించి క్విడ్ ప్రో కో విధానాన్ని తీసుకొచ్చారు. జగన్ జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ఇరిగేషన్ ప్రాజెక్టులను తన ధన దాహం తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఆయన హయాంలో విర్రవీగిన ఇసుక మాఫియా ధనదాహానికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోతే, దానిని తిరిగి నిర్మించడం కోసం ఎందుకు నిధులు కేటాయించలేదో జగన్ చెప్పాలి. 90 శాతం సబ్సిడీతో చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ప్రవేశపెడితే దానిని కూడా జగన్ రద్దు చేశాడన్నారు. పుంగనూరు పెద్దిరెడ్డి ద్వారా హంద్రీ, గాలేరు నగరి లింక్ అంటూ మట్టి పనుల పేరుతో రూ.1000 కోట్లు బిల్లులు మింగేశారు’ అని తెలిపారు.