పటమట సర్కిల్ డిప్యూటీ ఏసీపై వేటు
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:49 AM
వాణిజ్య పన్నుల శాఖ మూడో డివిజన్ పటమట సర్కిల్‌లోని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వి.మహేష్‌కుమార్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్ని ఆధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత వేటు వేశారు. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ చీఫ్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
- ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా చర్యలు
- మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన అధికారి
- ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
వాణిజ్య పన్నుల శాఖ మూడో డివిజన్ పటమట సర్కిల్‌లోని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వి.మహేష్‌కుమార్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్ని ఆధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత వేటు వేశారు. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ చీఫ్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గడచిన నెల 27, 28 తేదీల్లో ట్యాక్స్ వెహికల్ చెకింగ్ (సీవీటీ) విధులు నిర్వర్తించాల్సిన ఆయన హనుమాన్‌పేటలోని ఓ పార్శిల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ నుంచి తొలగించేసిన డ్రైవర్ ప్రసాద్‌ను వెంటబెట్టుకుని వెళ్లి అక్కడి సిబ్బందిని బెదిరించి బేరసారాలు మొదలుపెట్టారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘డ్రైవర్‌తో సహా సోదాల్లో స్వాహా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారులు ఆదేశాలతో డివిజన్ సంయుక్త కమిషనర్ కల్పన విచారణ నిర్వహించారు. ట్రాన్స్ పోర్టు కార్యాలయం సిబ్బంది, అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు పార్శిల్ బుక్ చేసిన వ్యక్తులను ఆమె విచారించారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను చూపించి విడివిడిగా విచారించారు. మహేష్‌కుమార్, డ్రైవర్ ప్రసాద్ అన్నమాటలను వారు అధికారికి వినిపించారు. ప్రాథమికంగా జరిగిన విచారణలో మహేష్‌కుమార్ ప్రతి అడుగులోను నిబంధనలను ఉల్లంఽఘించి అరాచకంగా వ్యవహరించినట్టు అధికారులు గుర్తించారు. పైగా వాణిజ్య పన్నుల శాఖకు ఎలాంటి సంబంధం లేని డ్రైవర్ ప్రసాద్‌ను వెంట బెట్టుకుని సోదాలకు వెళ్లడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. సంయుక్త కమిషనర్ కల్పన ప్రాథమిక విచారణ నివేదికను చీఫ్ కమిషనర్ కార్యాలయానికి పంపారు. మహేష్‌కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అక్కడి నుంచి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మహేష్‌కుమార్ వెంట అడుగులు వేసిన డ్రైవర్ ప్రసాద్ పాత్ర పైనా అధికారులు విచారణ చేశారు. వాణిజ్య పన్నుల శాఖతో ఏవిధమైన సంబంధం లేకపోయినా పలు పార్శిల్ కార్యాలయాల వద్దకు వెళ్లి సిబ్బందిని బెదిరించి నెలవారీ మామూళ్లు తెచ్చుకున్నట్టు తేలింది. మహేష్‌కుమార్‌పై ప్రాథమిక విచారణ పూర్తవ్వడంతో తుది విచారణ త్వరలో చేయబోతున్నారు. అదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖ పేరును ఉపయోగించుకుని అరాచకాలు చేసిన డ్రైవర్ ప్రసాద్ పైనా చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు.
ఏలూరు జిల్లా ఎమ్మెల్యేతో మహేష్ మంతనాలు
మహేష్‌కుమార్, ప్రసాద్ చేసిన నిర్వాకం ఆధారాలతో సహా బయట పడిపోవడంతో ఇద్దరూ రక్షణ చర్యలు మొదలుపెట్టారు. ముందుగా ఈ వ్యవహారంలో తానే బలి అవుతానని గ్రహించిన మహేష్‌కుమార్ ఏలూరు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేతో మంతనాలు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. పార్శిల్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. ఈ మూడు రోజులపాటు ఆయన ఏలూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి గోడును వెళ్లబోసుకున్నట్టు సమాచారం. మహేష్‌కుమార్, ఆ ఎమ్మెల్యే బాల్య మిత్రులు కావడంతో ఆయన ద్వారా కథ నడిపించాలని భావించారు. ఆ ఎమ్మెల్యే చీఫ్ కమిషనర్ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారితో మాట్లాడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్‌కుమార్ నిబంధనలను ఉల్లంఘించి తప్పులు చేసినట్టు నిర్ధారణయిందని, తానేమీ చేయలేనని చెప్పినట్టు తెలిసింది. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మహేష్‌కుమార్ లోటస్‌లో ఉన్న సర్కిల్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం వచ్చారు. చీఫ్ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను అధికారులు ఆయన చేతుల్లో పెట్టారు.