రేపు తేలనున్న ఆనంద్ ‘ఎస్సీ హోదా’ రద్దు
ABN , Publish Date - May 18 , 2026 | 04:50 AM
బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు వ్యవహారం మంగళవారం తేలనుంది. ఎస్సీ హోదా రద్దు వివాదంలో స్ర్కూటినీ కమిటీ సిఫారసుల మేరకు ఈ నెల..
భౌతికంగా విచారణకు రావాలి: జిల్లా కలెక్టర్
బాపట్ల, మే 17(ఆధ్రజ్యోతి): బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు వ్యవహారం మంగళవారం తేలనుంది. ఎస్సీ హోదా రద్దు వివాదంలో స్క్రూటినీ కమిటీ సిఫారసుల మేరకు ఈ నెల 4న జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఆనంద్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంలో ఆయన వాదన వినేందుకు మరో అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఆనంద్ ఇప్పటికే పోస్టు ద్వారా తన వివరణను కలెక్టర్‌కు పంపారు. అయితే, భౌతికంగా వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. తామిచ్చిన నోటీసుపై స్పందించేందుకు మంగళవారం(మే 19) వరకు గడువు ఉందని తెలిపారు. పోస్టల్ ద్వారా ఆనంద్ పంపిన వివరణను కూడా అదే రోజు పరిశీలిస్తామని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. దీంతో మంగళవారం నాటికి ఆనంద్ ఎస్సీ హోదా రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలావుంటే, ఎస్సీ హోదా రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాస్టర్ ఆనంద్ రివ్యూ పిటిషన్ వేసినట్లు సమాచారం. అదే విధంగా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి తనకు తగిన సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆనంద్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. మరోవైపు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ అక్కల రామిరెడ్డి సైతం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరుస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇదిలాఉండగా, సున్నితమైన ఎస్సీ హోదా రద్దు విషయంలో పాస్టర్ ఆనంద్‌కు నోటీసులు ఇవ్వడం నుంచి ప్రతి అంశాన్నీ అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇటు ప్రభుత్వ పెద్దలకు కూడా బాపట్ల కలెక్టర్ నివేదిస్తున్నారు. మొత్తం ప్రక్రియను నిబంధనల మేరకు చేపట్టామని ఆయన వివరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిబంధనల మేరకు వ్యవహరించాలని కలెక్టర్‌కు సూచించింది.