పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు రెడీ!
ABN , Publish Date - Apr 27 , 2026 | 03:48 AM
క్రైస్తవ మతాన్ని పాటించేవారు ఎస్సీ హోదా కోల్పోతారని, వీరు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని గతేడాది ఏప్రిల్ 30న రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.
పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు రెడీ!
బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటీసులు
క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు
అట్రాసిటీ వర్తించదు: హైకోర్టు తీర్పు
సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం
చర్యలపై ఇటీవల మరోసారి కోర్టు ఆరా
దీంతో హోదా రద్దు ప్రక్రియ వేగవంతం
బాపట్ల, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మతాన్ని పాటించేవారు ఎస్సీ హోదా కోల్పోతారని, వీరు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని గతేడాది ఏప్రిల్ 30న రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు ఈ తీర్పు సమర్థించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 24న తీర్పు వెలువరించింది. కులంపేరుతో తనను దూషించడంతో పాటు దాడి కూడా చేశారని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్.. 2021, జనవరిలో చందోలు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు ఆయన బంధువులు మరో ఐదుగురిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు పెట్టిన చింతాడ ఆనంద్.. పాస్టర్‌గా క్రైస్తవ మతబోధనలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన ఫిర్యాదులోనే ఆ విషయం ఉందని, అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుందని రామిరెడ్డి న్యాయపోరాటానికి దిగారు. బాపట్ల కోర్టు మొదలుకుని సుప్రీంకోర్టు వరకు ఈ కేసు సాగింది. మతం మారితే ఎస్సీ హోదా కోల్పోవడంతో పాటు వారు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని తీర్పునివ్వడంతో పాటు అక్కల రామిరెడ్డి, మరో ఐదుగురిపై నమోదైన అట్రాసిటీ కేసును ఏపీ హైకోర్టు గతేడాదే కొట్టివేసింది. ఈ ఏడాది మార్చి 24న అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుకు సంబంధించిన ప్రక్రియను బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం తాజాగా ప్రారంభించింది. ఇదిలావుంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చింతాడ ఆనంద్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
గతేడాదే వినతి.. ఇప్పుడు కదలిక: గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే బాధితుడు రామిరెడ్డి ఫిర్యాదు దారుడు ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేయాలని బాపట్ల జిల్లా రెవెన్యూ విభాగాన్ని ఆశ్రయించారు. గత నెలలో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో రెవెన్యూ విభాగం ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుపై ప్రక్రియ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం జాయింట్ కలెక్టర్ సారథ్యంలో జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ విచారణ చేసి ఎస్సీ హోదా రద్దు విషయంలో నిర్ణయం తీసుకోనుంది. దీనిలో భాగంగా ఈ నెల 16న తొలి విచారణ జరిగింది. దీనికి ఆనంద్ గైర్హాజరవగా, పిటిషనర్ రామిరెడ్డి హాజరయ్యారు. పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్, బాపట్ల ఆర్డీవోలు కూడా విచారణలో పాల్గొన్నారు. మరో 2 దఫాలుగా విచారణ ఉంటుందని, ఎస్సీ హోదా రద్దుపై నిర్ణయం తీసుకుంటామని బాపట్ల జిల్లా డీఆర్వో తెలిపారు.
గత వైసీపీ పాలకుల పాత్ర ఉంది: రామిరెడ్డి
అట్రాసిటీ కేసు వర్తించకపోయినా గత వైసీపీ పాలకుల ఒత్తిడికి తలొగ్గి అప్పట్లో రెవెన్యూ, పోలీస్ విభాగాలు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అక్కల రామిరెడ్డి చెప్పారు. ‘‘అయినా ఐదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి త్వరలోనే అర్థవంతమైన ముగింపు రానుంది. క్రైస్తవంలోకి మారి కూడా ఎస్సీ ఫలాలను అనుభవించడంతో పాటు అన్యాయంగా అట్రాసిటీ కేసు పెట్టి మమ్మల్ని తీవ్ర క్షోభకు గురిచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. అయితే, గత ప్రభుత్వంలో ఈ అక్రమ కేసు నమోదుకు కారకులైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడే వరకు నా న్యాయ పోరాటం ఆగదు.’’ అని తెలిపారు.
హైకోర్టులో అక్కల పిటిషన్
ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేయడంతో పాటు 2021లో కేసు నమోదు విషయంలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అప్పటి తహసీల్దార్, ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, డీఎస్పీ, ఎస్సైలపై కూడా చర్యలు తీసుకోవాలని అక్కల రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఈ నెల 24న హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆనంద్ ఎస్సీ హోదా రద్దుపై తీసుకున్న చర్యలేమిటో వివరించాలని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.