డోలీలో మృతదేహాన్ని మోసుకుంటూ..!
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:42 AM
అనారోగ్యం పాలైతే డోలీ... చివరకు ప్రాణాలు కోల్పోయినా డోలీయే! గిరి పుత్రులకు డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో..
కొమరాడ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): అనారోగ్యం పాలైతే డోలీ... చివరకు ప్రాణాలు కోల్పోయినా డోలీయే! గిరి పుత్రులకు డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మారుమూల గిరిశిఖర గ్రామం వాటకోసుకు చెందిన మెల్లిక వెంకటరావు(60)కు ఈనెల 11న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామ యువకులు డోలీ కట్టారు. సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీ మోసుకుంటూ.. రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి వనకాబడి గ్రామం వరకూ చేరుకున్నారు. అక్కడ నుంచి 108 వాహనంలో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. ఐదు రోజులు చికిత్స పొందినా ఆరోగ్య పరిస్థితి మెరుగవలేదు. ఇక కష్టమని వైద్యులు చెప్పడంతో సోమవారం ఆటోలో తిరుగు ప్రయాణమవగా మార్గంమధ్యలోనే ఆయన మృతిచెందారు. దీంతో వనకాబడిలో మృతదేహానికి గ్రామస్థులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్లు మోసుకుంటూ స్వగ్రామానికి చేరుకున్నారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో విద్య, వైద్య సేవలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత గిరిజనులు వాపోయారు. సీసాడవలస నుంచి నయా రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా.. ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.