Share News

కాదు నరరూప రాక్షసుడివి!

ABN , Publish Date - May 22 , 2026 | 04:33 AM

తాను చాలా మంచోడినని.. తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్లను ఏమీ చేయనని భరోసా ఇస్తున్నానని చెప్పిన మాజీ సీఎం జగన్‌పై పులివెందుల నియోజకవర్గం వేములకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాదు నరరూప రాక్షసుడివి!

  • ఆయన తాత, తండ్రి కూడా.. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చర్చలో పేర్ల పార్థసారథిరెడ్డి స్పష్టీకరణ

  • నేను కోర్టు నుంచి వస్తుంటే రాజారెడ్డి వర్గీయులు నన్ను నరికారు

  • మా వాళ్లు ఆయన్ను నరికారు.. ఆ హత్య కేసులో మమ్మల్ని వదిలేశారనడం పచ్చి అబద్ధం

  • మా వాళ్లలో 11 మందికి జీవిత ఖైదు.. వైఎస్‌ సీఎం అయ్యాక పెరోల్‌ రాకుండా చేశారు

  • మా మైనింగ్‌లు రద్దుచేశారు.. మా ఇళ్లను నేలమట్టం చేశారు

  • అంగ, ఆర్థిక బలాలను దెబ్బతీశారు.. నన్ను చంపేందుకు సూట్‌కేసు బాంబు పెట్టారు

  • ఈ కేసులో జగన్‌ కూడా ఉన్నారు.. తప్పించారు.. కోడూరులో 19 మందిని చంపేశారు

  • దేవగుడి కుటుంబాన్ని ముందుపెట్టి శివారెడ్డిని చంపించారు.. పరిటాల హత్య ప్లాన్‌

  • తండ్రీకొడుకులదే.. తులసిరెడ్డి, రామచంద్రయ్యపైనా హత్య కేసులు: పార్థసారథిరెడ్డి

(కడప-ఆంధ్రజ్యోతి)

తాను చాలా మంచోడినని.. తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్లను ఏమీ చేయనని భరోసా ఇస్తున్నానని చెప్పిన మాజీ సీఎం జగన్‌పై పులివెందుల నియోజకవర్గం వేములకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు రాజారెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా నరరూప రాక్షసులని మండిపడ్డారు. జగన్‌ శాంతి పలుకులు మేక తోలు కప్పుకొన్న తోడేలులా ఉన్నాయన్నారు. జగన్‌ వ్యాఖ్యలపై గురువారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చర్చలో ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. వంద గొడ్లను తిన్న రాబందు శాంతి వచనాలు పలికినట్లుగా జగన్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. తొలుత వారే తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. పులివెందులలో అడ్వకేటుగా ప్రాక్టీస్‌ చేస్తున్న తాను కోర్టు నుంచి వస్తుండగా.. రాజారెడ్డి వర్గీయులు దాడి చేశారని తెలిపారు. ‘నన్ను కత్తులతో నరికారు. 26 చోట్ల గాయాలయ్యాయి. ‘చనిపోయాననుకుని వదిలేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఏఎస్‌పీ గన్‌మెన్‌ వచ్చి నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ క్రమంలో చెన్నై ఆస్పత్రికి తరలించారు. కోర్టు నుంచి వస్తున్న నన్ను మీ తాత మనుషులు ఎలాగైతే నరికారో.. అలాగే ఎస్టేట్‌ నుంచి వస్తున్న మీ తాతను కూడా నా వర్గీయులు నరికారు.


మీ తాత ఏదో మహాత్ముడు అన్నట్లు బిల్డప్‌ ఇవ్వకు. నా ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలోనే అనుకోకుండా వైఎస్‌ రాజారెడ్డిపై మా అనుచరులు దాడులు చేశారు. ఆ దాడిలో నా తమ్ముడు కూడా చనిపోయాడు. రాజారెడ్డి హత్య కేసులోనాపేరు 19వ ముద్దాయిగా చేర్చారు. కడప సెషన్స్‌ కోర్టులో మా వాళ్లలో 11 మందికి జీవిత ఖైదు విధించింది. రాజారెడ్డి చనిపోయినప్పుడే మా ఇళ్లను నేలమట్టం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా వాళ్లకు పెరోల్‌ రాకుండా చేశారు. మా మైనింగ్‌లు కూడా ఏకంగా రద్దుచేశాడు. మీ నాన్న రాజకీయం గురించి మాట్లాడుతున్నావు. నా అంగబలం, అర్థబలం మీద దెబ్బకొట్టి నన్ను ఎన్నో హింసలకు గురిచేశారు’ అని ధ్వజమెత్తారు. మంగలి క్రిష్ణతో కలిసి తనపై సూట్‌కేసు బాంబు పెట్టించింది జగనేనని చెప్పారు. తనను, పరిటాల రవిని హత్యచేసేందుకు మద్దెలచెరువు సూరితో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ‘ఆ ఒప్పందంలో భాగంగా సూరి మంగలి కృష్ణ ద్వారా నన్ను చంపడానికి సూట్‌కేస్‌ బాంబు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులే గుర్తించారు. మంగలి క్రిష్ణ అరెస్టయి జైలుకెళ్లాడు. తర్వాత విడుదలయ్యాడు. ఈ కేసులో జగన్‌ కూడా ఉన్నాడు. దీనిపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 6 గంటలపాటు చర్చ జరిగింది. మరి ఏమైందో ఏమో కేసు నుంచి జగన్‌ను తప్పించారు’ అని వివరించారు. రాజారెడ్డి చనిపోయినప్పుడు రైల్వేకోడూరులో పొట్టేళ్లు కోసుకుని సంబరాలు చేసుకుని పండ్లు స్వీట్లు పంచుకున్నారని తెలిపారు. పులివెందులలో కూడా మంగళసూత్రాలు తెంపుకొని సంతోషించారని.. ఒక నరకాసురుడు పోయాడని కడప జిల్లా ప్రజలంతా సంబరపడ్డారని చెప్పారు. ఈ తరానికి జగన్‌ చరిత్ర తెలియదన్నారు.


శివారెడ్డిని, చెంగల్‌రాయుడిని చంపించారు..

‘వైఎస్‌, జగన్‌ క్రూరమృగాలు.. పరిటాల రవిని చంపించింది వారే.. అందుకు అనుగుణంగా పక్కా ప్లాన్‌ చేయించింది ఆ తండ్రీకొడుకులే. జమ్మలమడుగు శివారెడ్డిని చంపించారు, కోడూరు చెంగల్‌రాయుడిని, ఆయన అనుచరులు 18 మందిని హత్య చేయించారు. రాజారెడ్డిని శివారెడ్డి బంధించి గదిలో పెట్టారు. దీంతో ఆయన్ను చంపేందుకు రాజశేఖర్‌రెడ్డి దేవగుడి నారాయణరెడ్డి కుటుంబాన్ని ముందుపెట్టారు. తాను తెరవెనుక ఉండి కథ నడిపించారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబం విలేకరి నారాయణను, పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త శివరామిరెడ్డి, పెద్ద కుడాల కృష్ణారెడ్డి, కన్నపాపాయికి చెందిన రఘరామిరెడ్డి, కోడూరుకు చెందిన మైనింగ్‌ అధినేత వెంకటనరసయ్య, త్రివేణి స్టీల్‌ అధినేత మురళీధర్‌రెడ్డి అన్నను చంపేయించింది. ఏ నియోజకవర్గంలో బలంగా నిలబడే ప్రత్యర్థి ఉన్నా అంతమొందించమే వారి ధ్యేయం. జగన్‌ కడప ఎంపీ కాకముందే చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని చెంపదెబ్బలు కొట్టారు. అలాంటి చరిత్ర కలిగిన జగన్‌రెడ్డి గాంధీలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ తులసిరెడ్డి వారి బారి నుండి బతికిఉన్నారంటే ఆయన భార్య మాంగల్యబలం వల్లే. నేను చెప్పినవన్నీ నిజాలే.. కావాలంటే తులసిరెడ్డిని అడగండి తప్పేమో! ఆయన దాదాపు 40 ఏళ్లు పోరాడారు. రామచంద్రయ్య ఎంపీగా పోటీచేసినప్పుడు ఇండిపెండెంట్‌ అభ్యర్థి పోలంకి వెంకటసుబ్బయ్యను చంపేశారు.


ఈ ఇద్దరే చంపారంటూ కే సులు పెట్టి కడప సెంట్రల్‌ జైలుకు పంపించారు. రాజశేఖర్‌రెడ్డి తేనె పూసిన కత్తి అయితే.. జగన్‌ తడిగుడ్డతో గొంతు కోసే రకం. రక్తం తాగే రాక్షసులు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు’ అని విరుచుకుపడ్డారు. 1995 స్థానిక ఎన్నికల్లో వేంపల్లెలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుండడం సహించలేని రాజశేఖర్‌రెడ్డి.. పోలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. జనం ఆయన పంచా చొక్కా చింపేశారని చెప్పారు. వేల్పులలో సింగిల్‌ విండో నామినేషన్‌ వేయకుండా అడ్డుకుంటుంటే సతీశ్‌రెడ్డి వెళ్తే.. ఫైరింగ్‌ చేయగా ఇద్దరు చనిపోయారని.. సతీశ్‌రెడ్డి ఎలాగోలా బతికారని తెలిపారు. పగవాడికి కూడా వైఎస్‌ వివేకానందరెడ్డి లాంటి మరణం రాకూడదన్నారు. ఆయన్ను వారే హత్యచేయించారని పులివెందులలో ఏ చెట్టునడిగినా.. పుట్టనడిగినా చెబుతుందని.. కానీ దానిని ఏమీ తెలియని చంద్రబాబుపై నెట్టారని.. కడప ఎంపీగా పోటీచేసిన ఆదినారాయణరెడ్డే చంపించారన్నారని.. దీంతో ఆదినారాయణరెడ్డి మానసికంగా కుంగిపోయి ప్రచారాన్ని సైతం సరిగ్గా చేసుకోలేకపోయారని తెలిపారు.


ఆయన చెప్పింది సత్యం: తులసిరెడ్డి

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చర్చలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి కూడా పాల్గొన్నారు. పార్థసారఽథిరెడ్డి చెప్పింది అక్షర సత్యమని చెప్పారు. ‘రాయలసీమ జిల్లాల్లో వైఎస్‌ కుటంబం గురించి ఏ చెట్టు, పుట్టను అడిగినా చెబుతారు. రాజారెడ్డి హత్య కేసులో సంబంధం లేని వ్యక్తులు జీవిత ఖైదు అనుభవించారు. జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకుంటున్నారు. పోగాలం దాపురించినవారు హితుల వ్యాఖ్యలు వినరు.. కనరు’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - May 22 , 2026 | 04:41 AM