Share News

చిలుక వచ్చేసింది.. క్షేమంగా!

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:02 AM

‘రామ్మా చిలకమ్మా‘! అంటూ ‘ఆంధ్రజ్యోతి’ పిలుపునిచ్చింది. ఫలితంగా తప్పిపోయిన చిలుక చేరవలసిన చోటికి చేరింది! ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోకండి!

చిలుక వచ్చేసింది.. క్షేమంగా!

కాట్రేనికోన, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ‘రామ్మా చిలకమ్మా‘! అంటూ ‘ఆంధ్రజ్యోతి’ పిలుపునిచ్చింది. ఫలితంగా తప్పిపోయిన చిలుక చేరవలసిన చోటికి చేరింది! ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోకండి! అసలు విషయం ఇదీ!. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో బండారు దొరబాబు అనే వ్యక్తి వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. ఆయన రూ.80వేలు పెట్టి.. ఆఫ్రికన్‌ గ్రే ప్యారట్‌ జాతి చిలుకను కొని ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. స్వగ్రామం కొత్తపాలెంలోని ఇంట్లో పెంచుకుంటున్న ఆ చిలుక పది రోజుల క్రితం ఎగిరిపోయింది. ఆ చిలుక కొత్తపాలెంలోనే మరొకరి ఇంటి వద్ద ఉందన్న సమాచారంతో దొరబాబు అతడిని కలిసి చిలుకను ఇవ్వాలని కోరారు. అతడు ససేమిరా అనడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఈ నెల 24న(శనివారం) ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనం వచ్చిన నేపథ్యంలో.. ఆదివారం అయినవిల్లి మండలం మాగాం నుంచి ఓ వ్యక్తి దొరబాబుకు ఫోన్‌ చేసి.. చిలుక తన వద్ద ఉందని తెలిపాడు. తాను ఒక తాగుబోతు వద్ద నుంచి చిలుకను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నాడు. వేరే వ్యక్తితో చిలుకను పంపి దొరబాబుకు అందించాడు. దీనిపై దొరబాబు స్పందించారు. మీడియా మిత్రులు, సోషల్‌ మీడియా మిత్రులు కృషి వల్లే చిలుక తన వద్దకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jan 26 , 2026 | 04:04 AM