సీబీఐ మాకు న్యాయం చేయలేదు
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:46 AM
‘‘మాకు సీబీఐ న్యాయం చేయలేదు. మా కుమార్తె హత్య జరిగి 19 ఏళ్లు కావస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. చంద్రబాబు వంటి నేతలను అరెస్టు చేసి, కస్టడీకి తీసుకున్నారు.
చంద్రబాబు వంటి నేతనే అరెస్టు చేశారు
మా కుమార్తె కేసులో ఎలాంటి అరెస్టు జరగలేదు
జ్యుడీషియల్ కమిటీతో విచారణ చేయాలి
కోర్టులో అయేషామీరా తల్లిదండ్రులు
విజయవాడ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘మాకు సీబీఐ న్యాయం చేయలేదు. మా కుమార్తె హత్య జరిగి 19 ఏళ్లు కావస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. చంద్రబాబు వంటి నేతలను అరెస్టు చేసి, కస్టడీకి తీసుకున్నారు. మా కేసులో సీబీఐ ఏమీ చేయలేదు’’ అని బీఫార్మసీ విద్యార్థిని అయేషామీరా తల్లిదండ్రులు బాషా, శంషాద్‌బేగం న్యాయాధికారి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత సమాధి నుంచి అయేషామీరాకు సంబంధించిన కొన్ని భాగాలను అధికారులు సేకరించి రీపోస్టుమార్టం చేయించారు. ఆ భాగాలను విజయవాడ సీబీఐ కోర్టుకు అప్పగించారు. వాటిని తమకు అప్పగించాలని కొద్దిరోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది. వారి తరపున న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రీపోస్టుమార్టం జరిగిన తర్వాత రెండు నెలల్లో శరీర భాగాలను అప్పగించాలని.. కానీ, సీబీఐ వాటిని తమ వద్దే పెట్టుకుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయేషా శరీర భాగాలను ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరపున కౌన్సిల్ వాదించారు. వాదప్రతివాదనలు విన్న న్యాయాధికారి ఎల్.అన్నపూర్ణ, అయేషా శరీర భాగాలను తీసుకెళ్తామంటే ఇప్పుడే ఇస్తామని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. అయితే..రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున వాటిని ఇప్పుడు తీసుకెళ్లవచ్చా లేదా అన్న విషయాన్ని మతపెద్దలను సంప్రతించి చెబుతామనడంతో విచారణను 20వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం కోర్టు బయట బాషా, శంషాద్‌బేగం మీడియాతో మాట్లాడుతూ అయేషామీరా హత్యకేసును పునఃదర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసు విచారణకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.