పరవాడలో ఘోరం
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:19 AM
ఇటీవలే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది మంది మృతిచెందిన ఘటన మరుకవ ముందే... పరవాడలో మరో ఘోరం జరిగింది.
‘దక్షిణ ఎనర్జీ’లో భారీ అగ్ని ప్రమాదం
ఇద్దరు కార్మికుల సజీవ దహనం
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పైరోలిసిస్ ఆయిల్ తయారు చేస్తుండగా చెలరేగిన మంటలు
పరవాడ, అనకాపల్లి రూరల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవలే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది మంది మృతిచెందిన ఘటన మరుకవ ముందే... పరవాడలో మరో ఘోరం జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఫార్మా సిటీ పక్కనున్న ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-3లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పైరోలిసిస్ ఆయిల్ తయారు చేస్తుంటారు. ఈ ఆయిల్‌ను బయో డీజిల్‌లో వినియోగిస్తారు. ఈ పరిశ్రమలో మొత్తం తొమ్మిది మంది కార్మికులు పని చేస్తున్నారు. చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేశ్ (34) టెక్నీషియన్‌గా, అచ్యుతాపురం మండలం జగ్గంపేటకు చెందిన బి.త్రినాథ్ (24) హెల్పర్‌గా ఐదు నెలలుగా కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ సోమవారం జనరల్ షిఫ్ట్‌నకు హాజరయ్యారు. డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ... వారి స్థానంలో రావాల్సిన ఇద్దరు కార్మికులు రాకపోవడంతో నైట్ షిఫ్ట్‌లో కూడా వాళ్లే కొనసాగాల్సి వచ్చింది.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు రియాక్టర్‌లో వేస్ట్ ప్లాస్టిక్‌ను మండించి ఆ ద్రావణాన్ని పక్కనే ఉన్న ఫిల్టర్స్ ట్యాంకులోకి పంపుతుండగా ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్, త్రినాథ్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి. అటుగా పరిశ్రమలకు వెళుతున్న కార్మికులు మంటలు గమనించి అనకాపల్లి, రాంకీ ఫైర్ స్టేషన్లకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పైరోలిసిస్ ఆయిల్‌గా తయారు చేసే క్రమంలో మిథేన్, హైడ్రోజన్ కార్బన్‌మోనాక్సైడ్‌వంటి వాయువులు తయారవుతాయని, వాటికి మండే స్వభావం ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రమాదానికి కారణం ఏమిటనేది కచ్చితంగా తెలియరాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా, పరిశ్రమలో కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రమాద ఘటనపై సీఎం విచారం
దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కార్మికుల మృతికి సంతాపం తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.
మృతుల కుటుంబాలకు రూ.33 లక్షల పరిహారం
దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వేపాడ వెంకటేశ్, బి.త్రినాథ్ కుటుంబ సభ్యులకు పరిశ్రమ యాజమాన్యం రూ.33 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అనంతరం తహశీల్దార్ పీవీ రత్నం చేతుల మీదుగా ఇరు కుటుంబాలకు చెక్కులు అందజేశారు.