పాపికొండల పర్యటనకు బ్రేక్
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:27 AM
పాపికొండల పర్యాటక బోట్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో పోచమ్మ గండి పాయింట్ వద్ద 15 టూరిజం బోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
పర్యాటక బోటులో సాంకేతిక సమస్య
నేడు బోట్లను తనిఖీ చేయనున్న అధికారులు
పోలవరం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): పాపికొండల పర్యాటక బోట్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో పోచమ్మ గండి పాయింట్ వద్ద 15 టూరిజం బోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ముందుగానే శనివారం, ఆదివారం పర్యటనకు టికెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులు ఆందోళన చేశారు. శనివారం బోట్ పాయింట్ వద్ద 200 మంది పర్యాటకులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఆదివారం మొత్తం 360 మందికి టికెట్ సొమ్ము పూర్తిగా వెనక్కి చెల్లిస్తామని సమాచారం ఇచ్చినట్లు ఏపీ టూరిజం అధికారి గంగబాబు తెలిపారు. కాగా, ఈ నెల 12న పోచమ్మ గండి టూరిజం పాయింట్ నుంచి 89 మంది పర్యాటకులతో బయల్దేరిన బోటుకు దేవీపట్నం సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న నిర్వాహకులు ఆ బోటును ఒడ్డుకు చేర్చారు. దీనిపై పోలవరం జిల్లా రంపచోడవరం ఆర్డీవో స్వాతి స్పందిస్తూ.. పర్యాటక బోట్లు నిలిపివేయాలని ఏపీ టూరిజం అధికారులను ఆదేశించారు. టూరిజం బోట్ల ఫిట్‌నెస్, అనుమతులు, భద్రతా చర్యలు, తదితర అంశాలపై ఆర్డీవో, ఇతర అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహిస్తారని ఏపీ టూరిజం అధికారి గంగబాబు తెలిపారు. అనంతరం అధికారుల అనుమతితో తిరిగి బోట్ల రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు.