పంచధారల ఉనికితో ఆటలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:24 AM
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఫణిగిరిగా పేరుగాంచిన పంచదార్ల పుణ్యక్షేత్రం ఉనికికి గ్రావెల్ తవ్వకాలు ముప్పుగా పరిణమించాయి.
గ్రావెల్ తవ్వకాలతో తగ్గిన ప్రవాహం
రంగు మారిన ప్రధాన జలధార
స్పందించిన గనులు, భూగర్భ శాఖ
తక్షణం తవ్వకాల నిలిపివేతకు ఆదేశాలు
రాంబిల్లి/అచ్యుతాపురం, జూలై 16(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఫణిగిరిగా పేరుగాంచిన పంచదార్ల పుణ్యక్షేత్రం ఉనికికి గ్రావెల్ తవ్వకాలు ముప్పుగా పరిణమించాయి. పుణ్యక్షేత్రం సమీపంలో ఇటీవల గ్రావెల్ తవ్వకాలు ప్రారంభించారు. ఫణిగిరి పర్వతంపై నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచధారలు తమ ఉనికిని కోల్పోవలసి వస్తోంది. పంచదార్ల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం ఆ గోతుల్లో చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రధాన జలధార క్రమంగా తగ్గిపోతోంది. రంగు కూడా మారిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధారలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. ఏటా కార్తీక మాసంలోను, మహాశివరాత్రి పర్వదినాల్లోను పంచదార్ల పుణ్యక్షేత్రంలో ప్రవహించే ఐదు ధారలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఫణిగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ కొండపై గ్రావెల్ తవ్వకాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తంశారు. పాలకులు స్పందించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దరిమిలా పంచదార్ల గ్రామ పరిధిలోని సర్వే నంబరు1లోని 2.153 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాలను శాఖాపరమైన సర్వే, వివరణాత్మక తనిఖీ పూర్తయ్యేంత వరకు తక్షణమే నిలిపివేయాలని అనకాపల్లి గనులు, భూగర్భ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించింది.
ఇదీ చరిత్ర: పంచపాండవులు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని, ధర్మరాజు స్వయంగా పంచదార్లలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని, అందుకే ధర్మలింగేశ్వరస్వామిగా పిలుస్తారని 14వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొండపై నుంచి ఐదు నీటి ధారలు వచ్చి ధర్మలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కలుస్తాయి. ఐదు ధారలు కలిసిన ప్రదేశం అవడంతో దీనిని పంచధారలు అనే నామకరణం చేశారు. క్రమేపీ ప్రస్తుతం ఇది పంచదార్లగా మారింది. వందల ఏళ్ల నుంచి ఈ ధారలు నిరంతరాయంగా వస్తున్నాయి.