Share News

ఆ ఐదేళ్లలోఎంత అరాచకమో..

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:00 AM

తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉండటం, ఆపార్టీకి ఓటేయడమే వారి తప్పయింది. పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ఆత్మకూరు గ్రామానికి చెందిన 116 కుటుంబాలను గ్రామంలో అడుగు పెట్టనీయకుండా ఐదేళ్లపాటు వైసీపీ నేతలు తరిమిగొట్టారు.

ఆ ఐదేళ్లలోఎంత అరాచకమో..

  • జగన్‌ పాలనలో పల్నాడు జిల్లా దళితులపై దాష్టీకం

  • టీడీపీకి ఓటేశారనే అక్కసుతో దాడులు

  • తల్లడిల్లిన దళిత హృదయాలకు నాడు చంద్రబాబు భరోసా

  • ఆత్మకూరు ఎస్సీలకు ప్రభుత్వ సాయం

  • రూ.1.16 కోట్లను అందించిన ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి

వెల్దుర్తి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉండటం, ఆపార్టీకి ఓటేయడమే వారి తప్పయింది. పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ఆత్మకూరు గ్రామానికి చెందిన 116 కుటుంబాలను గ్రామంలో అడుగు పెట్టనీయకుండా ఐదేళ్లపాటు వైసీపీ నేతలు తరిమిగొట్టారు. మహిళలు, గర్భిణుల పట్ల కనీసం కనికరం చూపకుండా దాడులకు తెగబడ్డారు. వీరి కష్టాలు చూడలేక నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమం తలపెట్టగా నాటి వైసీపీ పాలకులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు చంద్రబాబును కలిసేందుకు గుంటూరు వెళ్లారు. వారికి తాత్కాలిక ఆవాసం కల్పించి ఆరు నెలలపాటు ఆదుకొని పోలీసుల సహాయంతో గ్రామానికి వచ్చేందుకు చంద్రబాబు కృషి చేశారు’’ అంటూ వైసీపీ పాలనలో దళితులపై దాష్టీకాలను మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గుర్తుచేశారు. దళితులను అన్ని విధాలా ఆదుకుంటానని ఆనాడు చంద్రబాబు వారికిచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.లక్ష చొప్పున 116 కుటుంబాలకు రూ.1.16 కోట్లు అందించారన్నారు. గురువారం వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారితో ఆయన సమావేశమై చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 3 వేల మంది దళితులు హత్యకు గురయ్యారని చెప్పారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు మేకల దాసు (బిక్షం) మాట్లాడుతూ, రాష్ట్రంలో దళిత హక్కులను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. దళిత నేత మాచర్ల వాసు మాట్లాడుతూ, నాడు ఇబ్బందులు పడ్డ దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయం చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాటి బాధితులు తమ అనుభవాలు పంచుకున్నారు.

మహిళలు అని కూడా చూడలేదు

గ్రామంలో వైసీపీ నాయకులు మాపై అక్కసు పెంచుకొని మహిళలు అని కూడా చూడకుండా కులాల పేరుతో దూషిస్తూ గ్రామం నుంచి తరిమికొట్టారు. నా కుమార్తె ప్రసవ వేదనతో బాధపడుతున్నా కనీసం కనికరం చూపలేదు. గ్రామంలో ఉండడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. గత్యంతరం లేక మేము ఊరు విడిచి వెళ్లిపోయాం. మమ్మల్ని అక్కున చేర్చుకొని, మా కుటుంబాలు చెదిరిపోకుండా కాపాడి అధికారంలోకి వచ్చాక గుర్తుంచుకుని ఆర్థికసాయం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. - మందా శాంతికుమారి

Updated Date - Feb 06 , 2026 | 03:00 AM