Share News

వేయి హెక్టార్లలో పామాయిల్‌ సాగు

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:19 PM

జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని, నీటి పొదుపుకు అనుగుణంగా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు.

   వేయి హెక్టార్లలో పామాయిల్‌ సాగు
సీ.బెళగల్‌ మండలంలో పామాయిల్‌ చెట్ల పెరుగుదలను పరిశీలిస్తున్న ఉధ్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి

13 మండలాల ఎంపిక

ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఏర్పాటు

ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని, నీటి పొదుపుకు అనుగుణంగా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఉద్యానశాఖ కార్యాలయంలో రాజా కృష్ణారెడ్డి విలేకరులకు జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ తోటల సాగు వివరాలను అందజేశారు. కర్నూలు జిల్లాలో ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, హాలహర్వి, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొళగుంద, నందవరం, సి. బెళగల్‌, గోనెగండ్ల, కృష్ణగిరి మండలాల్లో ఆయిల్‌ఫామ్‌ తోటల పెంపకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి పామాయిల్‌ తోటలను పెంచితే దాదాపు 25 సంవత్సరాలు ఉత్పత్తిని అందిస్తాయని, ఒక్కో విడతకు మూడు సంవత్సరాల తర్వాత 3 నుంచి 4 టన్నులు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల తర్వాత 10 నుంచి 15 టన్నుల దాకా ఉత్పత్తి రైతు చేతికి అందుతుందన్నారు. ఉత్పత్తి రావడం మొదలైన తర్వాత రైతులు ఎటువంటి శ్రమ లేకుండా ఆయా కంపెనీలే రైతుల పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఒక టన్ను పామాయిల్‌ గెలల ధర రూ.23వేల దాకా ఉందని, ఒక ఎకరాలో పామాయిల్‌ చెట్లను పెంచేందుకు కేవలం రూ.50వేలు మాత్రమే రైతులకు ఖర్చు వస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో నవభారత, పతంజలి, లివింగ్‌ ఫుడ్స్‌ కంపెనీలు రైతుల నుంచి పామాయిల్‌ గెలలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని అన్నారు. ఈ సంవత్సరం వేయి హెక్టార్లలో పామాయిల్‌ గెలలను పెంచేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, ఇప్పటికీ 150 నుంచి 200 హెక్టార్లలో పామాయిల్‌ తోటల పెంపకం జరుగుతుందని తెలిపారు. ఈ పామాయిల్‌ చెట్లకు నీటిని అందించేందు కోసం చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ను ఏర్పాటు చేస్తారని అన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:19 PM