‘కల్తీ’ నుంచి తప్పించుకునేందుకే హెరిటేజ్‌పై బురద: పల్లా
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:02 AM
తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదచల్లుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదచల్లుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక స్పష్టం చేస్తున్నా వైసీపీ క్లీన్ చిట్ నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతోంది. తిరుమల నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. ఆ అంశాన్ని పక్కనపెట్టి వేరే సంస్థలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇలా నెయ్యి స్కాం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు దశాబ్దాలకుపైగా నిష్కళంక చరిత్ర కలిగిన హెరిటేజ్ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని సహించం. ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన అసెంబ్లీలో వైసీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు కూడా గర్హనీయం’ అని పల్లా పేర్కొన్నారు.