సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చాం
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:37 AM
‘స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దబాటుపై భాగస్వామ్య పక్షాలతో నాలుగు దఫాలుగా సమావేశాలు నిర్వహించాం. సీట్ల కేటాయింపుపై దాదాపు ఒక అవగాహనకు వచ్చాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ప్రకటన
అన్ని స్థానాల్లో విజయమే ధ్యేయంగా కార్యాచరణ: పల్లా
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దబాటుపై భాగస్వామ్య పక్షాలతో నాలుగు దఫాలుగా సమావేశాలు నిర్వహించాం. సీట్ల కేటాయింపుపై దాదాపు ఒక అవగాహనకు వచ్చాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు. ‘స్థానిక పోరులో అన్ని స్థానాల్లో విజయమే ధ్యేయంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయానికి పెద్దపీట వేస్తున్నాం. సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున బీసీ, ఓసీ తదితర కేటగీరీల వారీగా అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రిజర్వేషన్లపై స్పష్టత వస్తుంది. ఆ వెంటనే సీట్ల సర్దుబాటు ప్రక్రియకు తుదిరూపు ఇస్తాం మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక పరిస్థితులపై అవగాహన, ప్రజలతో అనుబంధం, అభివృద్ధి అంశాలపై పట్టున్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నాం. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయంతో పాటు అభ్యర్థులు, పార్టీ శ్రేణుల మధ్య ఎలాంటి పొరపొచ్చాలకు తావులేకుండా ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొంటాం’ అని పల్లా స్పష్టం చేశారు.