పల్లా భావోద్వేగం.. కన్నీటి పర్యంతం
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:25 AM
శాఖ ఉక్కు కర్మాగారంలో ఇంతటి ఘోర ప్రమాదం సంభవించడాన్ని తట్టుకోలేకపోతున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బోరుమన్నారు.
నేడు ముఖ్యమంత్రి వచ్చే అవకాశముందని వెల్లడి
గాజువాక/ఉక్కుటౌన్‌షిప్/కూర్మన్నపాలెం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇంతటి ఘోర ప్రమాదం సంభవించడాన్ని తట్టుకోలేకపోతున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బోరుమన్నారు. సోమవారం రాత్రి స్టీల్‌ప్లాంటు జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అక్కడ బాధితవర్గాల రోదనలు మిన్నంటగా.. పల్లా కూడా తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. చాలాసేపు మాట్లాడలేకపోయారు. తర్వాత తేరుకుని.. తనకు స్టీల్‌ప్లాంటు ఎంతో సెంటిమెంటని, ఇక్కడ ఏం జరిగినా అది సొంత ఇంట్లో జరిగినట్టు భావిస్తానని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానన్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కు మంత్రి మంగళవారం విశాఖ వచ్చి బాధితులను పరామర్శించే అవకాశముందన్నారు. మృతు లు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
హోం మంత్రి, ఎంపీ సందర్శన
విశాఖ కర్మాగారంలో ప్రమాద జరిగిన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘోర ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టికి ప్రమాద సమాచారం తీసుకువెళ్లామన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.