Share News

రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:53 AM

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం వేకువజామున ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది.

రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

  • భర్త, అత్తింటి వేధింపులే కారణం!

పలాస, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం వేకువజామున ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలి తల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. సంతబొమ్మాళి మండలం భావనపాడుకు చెందిన పూజ(29)కు ఎనిమిదేళ్ల క్రితం చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల వెంకటరావుతో వివాహమైంది. వీరికి కుమారుడు కుశ్వంత్‌(7), కుమార్తె దీక్షిత(4) ఉన్నారు. గత ఆర్నెల్ల నుంచి అత్త, భర్త, ఆడపడుచులు వేధిస్తున్నట్టు పూజ తల్లికి చెప్పి తరచూ బాధపడేది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వెంకటరావు ఫోన్‌ చేసి మీ కుమార్తె చనిపోయిందని సమాచారం ఇవ్వడంతో తల్లి అన్నపూర్ణ నిర్ఘాంతపోయింది. పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చి కుమార్తె, చిన్నారుల మృతదేహాలు చూసి కుటుంబసభ్యులు భోరున విలపించారు. భర్త, అత్త, ముగ్గురు ఆడపడుచుల వేధింపుల కారణంగానే తన కుమార్తె పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందని అన్నపూర్ణ ఆరోపించారు. రైల్వే సీఐ ఎ.రవికుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:55 AM