Share News

పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:26 AM

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో మంగళవారం పట్టపగలే దుండగులు హల్‌చల్‌ సృష్టించారు. ఓ జ్యూవెలరీస్‌ షాపు యజమానిని తుపాకీతో బెదిరించి కోటిన్నరకు పైగా విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..

  • పట్టపగలే రూ.1.65 కోట్ల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

పలాస, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో మంగళవారం పట్టపగలే దుండగులు హల్‌చల్‌ సృష్టించారు. ఓ జ్యూవెలరీస్‌ షాపు యజమానిని తుపాకీతో బెదిరించి కోటిన్నరకు పైగా విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. కాశీబుగ్గ నిత్యానందనగర్‌ మార్కెట్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వర జ్యూవెలరీ షాపులోకి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల పేరు చెబుతూ ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం మరో ముగ్గురు వ్యక్తులు వెళ్లి షాపు యజమాని కిల్లంశెట్టి రామకృష్ణరావు చేతికి బేడీలు వేసి పోలీసులుగా నమ్మకం కలిగించారు. ఆ తర్వాత మరో వ్యక్తి లోపలికి వచ్చి యజమాని ముఖంపై ముష్టిఘాతాలు కురిపిస్తూ తుపాకీ తీసి బెదిరించాడు. అనంతరం షాపులో లాకరు తెరిపించి బంగారు నగలు, షోకేస్‌లో ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం కిలోపైనే ఎత్తుకెళ్లారు. వాటి విలువ రూ.1.65 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దోపిడీ వ్యవహారం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యింది. అయితే, ముఖాలకు మాస్కులు వేసుకోవడంతో వారు ఎవరు? ఏ ప్రాంతం వారన్నదీ పోలీసులు ఆరా తీస్తున్నారు. మూడు ద్విచక్రవాహనాలు, ఒక కారులో మొత్తం 8 మంది వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

Updated Date - Apr 08 , 2026 | 04:26 AM