మడ అడవుల్లో పాగా!
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:54 AM
కృత్తివెన్ను మండలంలో విస్తారంగా విస్తరించిన మడ అడవులపై స్థానిక నాయకుల కన్నుపడింది. సుమారు 20 ఎకరాల్లోని మడ చెట్లను స్థానిక కూలీలతో నరికించివేశారు. మరింత భూమిని ఆక్రమించేందుకు కుట్ర పన్నారు. వీటిని చెరువులుగా తవ్వించేసి వ్యాపారం చేయడమే వీరి లక్ష్యంగా తెలుస్తోంది. మడ అడువులు మాయం కావడంతో ఆయా గ్రామాలకు తుఫాన్ల ముప్పు పొంచి ఉంది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
- నిడమర్రులో సుమారు 20 ఎకరాల ఆక్రమణ
- స్థానిక కూలీలతో చెట్లు నరికివేత
- చెరువులుగా మార్చేందుకు స్థానిక నేతల కుట్ర
- ఆయా గ్రామాలకు పొంచి ఉన్న తుఫాన్ల ముప్పు
- పట్టించుకొని అధికారులు
కృత్తివెన్ను మండలంలో విస్తారంగా విస్తరించిన మడ అడవులపై స్థానిక నాయకుల కన్నుపడింది. సుమారు 20 ఎకరాల్లోని మడ చెట్లను స్థానిక కూలీలతో నరికించివేశారు. మరింత భూమిని ఆక్రమించేందుకు కుట్ర పన్నారు. వీటిని చెరువులుగా తవ్వించేసి వ్యాపారం చేయడమే వీరి లక్ష్యంగా తెలుస్తోంది. మడ అడువులు మాయం కావడంతో ఆయా గ్రామాలకు తుఫాన్ల ముప్పు పొంచి ఉంది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-కృత్తివెన్ను:
జిల్లాలో శివారు మండలమైన కృత్తివెన్నులో సుమారు 25 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ తీరంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వేలాది ఎకరాల ఖాళీ భూములున్నాయి. ఈ భూముల్లో మడ అడవులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా ఇంతేరు, కృత్తివెన్ను, నిడమర్రు, చినగొల్లపాలెం పంచాయతీల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్లో మడ అడవులున్నాయి. ఈ ప్రాంతం ఆక్వా సాగుకు అనువుగా ఉండటం, భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు నాయకుల కన్ను ఈ భూములపై పడింది. తొలుత ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిలోనున్న మడ అడవులను స్థానికుల చేత నరికించి, భూములను ఆక్రమిస్తున్నారు. ఆ తర్వాత వాటి చుట్టూ గట్లు వేసి చెరువులుగా మార్చేస్తున్నారు.
స్థానికులే కూలీలు
మడ చెట్లను నరికేందుకు స్థానికులనే కూలీలుగా వాడుతున్నారు. కూలీలకు స్థానికంగా పని దొరకటంతో వారు కూడా పెద్దలకు సహకరిస్తున్నారు. కేవలం కొన్ని గంటల పాటు పనిచేస్తే వందల రూపాయల కూలీ చెల్లిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ కూలీ రావటంతో పాటు మడ చెట్లను వంట చెరుకుగా వాడుకొనేందుకు వీలు కల్పించడంతో కూలీలు కూడా నాయకుల వైపే ఉంటున్నారు. దీన్నే బలంగా మార్చుకున్న నాయకులు ఆ కూలీలను రైతులుగా సమాజానికి చూపుతూ, ఆ భూములు వారే ఆక్రమించుకుంటున్నారని, స్థానిక రైతులు, ప్రజలకు సహకరించాలన్న మానవత్వం ప్రదర్శిస్తున్నట్టు నటిస్తూ వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదల చాటున పెద్దలు కాజేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా అక్రమార్కుల తీరు మాత్రం మారటం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే పార్టీ స్థానిక నాయకులు ఈ తంతును నడుపుతూ భూములను కాజేస్తున్నారు.
కనుమరుగవుతున్న అడవులు
సముద్ర తీరంలో తుఫాను వంటి విపత్తుల సమయంలో తీరాన్ని రక్షించటంలో కీలక పాత్ర పోషించే మడ అడవులను పెంచాలని ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే కృత్తివెన్ను మండలంలో మాత్రం ఉన్న మడ అడవులన్నీ కొద్దికొద్దిగా కనుమరుగవుతున్నాయి. మండల పరిధిలోని ఇంతేరు, కృత్తివెన్ను, నిడమర్రు పంచాయతీల్లో వేలాది ఎకరాల్లో ఉన్న మడ అడవులు చెరువులుగా మారుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
తాజాగా నిడమర్రులో ఆక్రమణ
నిడమర్రు పంచాయితీలో నిడమర్రు దళితవాడ, గోగిలేరు పాయకు మధ్యలోనున్న సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూముల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిపై కన్నేసిన కొందరు స్థానిక నాయకులు వాటిని ఆక్రమించి, చెరువులు తవ్వేందుకు పన్నాగం పన్నారు. దీనికి గాను ఇటీవల స్థానిక కూలీల చేత ప్రతి రోజు మడ చెట్లను నరికిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 ఎకరాల భూమిలో మడ అడవులను నరికివేసారు. ఇంతలో విషయం బయటకు పొక్కడంతో అధికారులు తాత్కాలికంగా పనులు నిలిపివేయించారు. కానీ తిరిగి పనులు ప్రారంభించేందుకు నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
చోద్యం చూస్తున్న అధికారులు
తీరంలో మడ అడవులు నరుకుతున్నా.. ప్రభుత్వ భూములను కాజేస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కేవలం పత్రికల్లో కథనాలు వస్తేనే అధికారులు స్పందించి, తాత్కాలికంగా వాటిని అడ్డుకుంటున్నారు. తిరిగి కొన్ని రోజుల్లోనే నాయకులు తమ పనులు బహిరంగంగానే చేసుకుపోతున్నారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు లోబడి వారి ఒత్తిళ్లకు తగ్గట్టుగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
- శశికుమార్, తహసీల్దార్
మడ చెట్లు నరికిన, ప్రభుత్వ భూములు ఆక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటాం. నిడమర్రులో మడ చెట్ల నరికివేత విషయం మా దృష్టికి రాగానే అధికారులను పంపించాం. అవి ప్రభుత్వ భూములుగా గుర్తించాం. ఆ భూముల చుట్టూ జెండాలను పాతమన్నాం. పనులు తిరిగి ప్రారంభిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. మిగిలిన ప్రభుత్వ భూములను కూడా గుర్తించి, మడ చెట్లకు తగిన రక్షణ కల్పిస్తాం.