క్యాన్సర్‌పై యుద్ధభేరి.. నోరి
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:28 AM
దేశంలో నానాటికీ విశ్వరూపం దాలుస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధభేరిని మోగించి.. దాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు.....
మంటాడ నుంచి మ్యాన్‌హ్యాటన్ వరకూ దత్తాత్రేయుడి విజయయాత్ర
విజయవాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): దేశంలో నానాటికీ విశ్వరూపం దాలుస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధభేరిని మోగించి.. దాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకూ మార్గనిర్దేశం చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రేడియేషన్ ఆంకాలజిస్ట్.. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు! జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో నేతలకు ఆత్మీయ వైద్యుడైన ఆయన.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం మంటాడ గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య స్థానికంగా పూర్తి చేసిన ఆయన.. మచిలీపట్నంలోని ఆంధ్రా జాతీయ కళాశాల(నేషనల్ కాలేజీ)లో పీయూసీ, కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు. ఐదు దశాబ్దాలుగా ప్రముఖ ఆంకాలజి్‌స్టగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని టాప్ 5 క్యాన్సర్ వైద్య నిపుణులలో ఆయన ఒకరు. 9రకాల క్యాన్సర్‌లకు చికిత్సలు అందిస్తున్న వైద్యుడిగా ప్రసిద్ధి పొందారు. భారత్‌తో పాటు అనేక దేశాల్లో క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను స్థాపించడానికి కృషి చేశారు. ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న ఆయన.. అప్పుడప్పుడూ తన స్వగ్రామాన్ని సందర్శిస్తుంటారు. దత్తాత్రేయుడు సతీమణి సుభద్ర కూడా డాక్టర్. వీరికి ఇద్దరు సంతానం. వైద్యరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘మంటాడ టూ మ్యాన్‌హ్యాటన్ ’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని నిరుడు మార్చిలో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి విశేష సేవలందిస్తున్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడి కృషిని గుర్తించి.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.