Share News

Adinarayan Rao Passes Away: పద్మశ్రీ డాక్టర్‌ ఆదినారాయణరావు కన్నుమూత

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:47 AM

పోలియో రహిత సమాజం కోసం కృషిచేసిన పద్మశ్రీ డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు (86) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు.

Adinarayan Rao Passes Away: పద్మశ్రీ డాక్టర్‌ ఆదినారాయణరావు కన్నుమూత

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజం కోసం కృషిచేసిన పద్మశ్రీ డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు (86) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన కొద్దికాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. వైద్యవృత్తి చేపట్టిన తరువాత ఆయన దేశవ్యాప్తంగా వేయి వరకు శిబిరాలు నిర్వహించి మూడు లక్షల పైచిలుకు పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. విశాఖలో ప్రేమ ఆస్పత్రిని స్థాపించి, ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారికి ఉచితంగా చికిత్సలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1939 జూన్‌ 30లో శేషమ్మ, కనకం దంపతులకు ఆదినారాయణరావు జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివి, ఆ తరువాత ఆర్థోపెడిక్‌లో ఎంఎస్‌ చేశారు. ఆ కాలేజీలోనే ఉద్యోగ జీవితం ప్రారంభించి ట్యూటర్‌ నుంచి ప్రొఫెసర్‌ స్థాయి వరకు పనిచేశారు. విశాఖలో దివ్యాంగులకు సేవలు అందించే రాణీ చంద్రమదేవి ఆస్పత్రిలోని రీహేబిటేషన్‌ సెంటర్‌కు సూపరింటెండెంట్‌గా సేవలు అందించారు. రిటైరైన తరువాత ప్రీ పోలియో సర్జికల్‌ అండ్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి, దానికి మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య శశికళ కూడా వైద్యురాలే. గైనకాలజిస్ట్‌ అయిన ఆమె కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆదినారాయణరావు 1988లో ప్రధానమంత్రి జాతీయ అవార్డు, 2013, 2014లలో వరుసగా నేషనల్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అవార్డును నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతులు మీదుగా అందుకున్నారు. 2022లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Updated Date - Jan 18 , 2026 | 03:47 AM