Share News

పీఏసీఎస్‌ ఉద్యోగుల ఆందోళన విరమణ

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:07 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఉద్యోగులు ఆందోళన విరమించారు. కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న పీఏసీఎస్‌ ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన..

పీఏసీఎస్‌ ఉద్యోగుల ఆందోళన విరమణ

  • డిమాండ్లపై సర్కారు సానుకూల నిర్ణయం

  • జీతాలు 20 శాతం, గ్రాట్యుటీ 4 లక్షలకు పెంపు

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఉద్యోగులు ఆందోళన విరమించారు. కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న పీఏసీఎస్‌ ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకారశాఖల మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, సహకారశాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు, ఆప్కాబ్‌ ఎండీ రామకృష్ణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. పీఏసీఎస్‌ ఉద్యోగుల జీతాల 20శాతం పెంపును ఆమోదిస్తూ ఈ సందర్భంగా మంత్రి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రాట్యుటీని రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు పెంచాలని, ప్రతి ఉద్యోగికీ రూ.5లక్షల గ్రూప్‌ ఆరోగ్య బీమా అమలు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్న ప్రకటించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Feb 25 , 2026 | 05:08 AM