ఓనరే డ్రైవర్
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:15 AM
హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాద దుర్ఘటన వెనుక యజమాని అంతులేని నిర్లక్ష్యం ఉన్నట్టు బయటపడింది. బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా ఆయనే స్వయంగా బస్సు నడిపి 14 మంది ప్రయాణికులను బలి తీసుకున్నాడు.
ప్రమాద సమయంలో బస్సు నడిపింది ఆయనే
ట్రావెల్స్ యజమాని అంతులేని నిర్లక్ష్యం
బస్సు కండిషన్‌లో లేదని తెలిసీ ప్రాణాలతో చెలగాటం
ముందుగానే బస్సు పరిస్థితి చెప్పిన డ్రైవర్
కలిగిరి నుంచి మాచర్ల వరకు ఎదురెళ్లిన హరికృష్ణారెడ్డి
అక్కడి నుంచి డ్రైవింగ్.. టిప్పర్‌ను ఢీకొట్టాక పరారీ
మంటల్లో 14 మంది బుగ్గి.. 28 మందికి గాయాలు
మార్కాపురం పోలీసుల అదుపులో యజమాని
ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు బస్సుల కొనుగోలు
ప్రమాదానికి గురైన బస్సు అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టర్
ఒంగోలు/మార్కాపురం/కలిగిరి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాద దుర్ఘటన వెనుక యజమాని అంతులేని నిర్లక్ష్యం ఉన్నట్టు బయటపడింది. బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా ఆయనే స్వయంగా బస్సు నడిపి 14 మంది ప్రయాణికులను బలి తీసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరగకముందు బస్సు కండిషన్ సరిగా లేదని డ్రైవర్ యువరాజు పలుమార్లు ఆయనకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో యజమాని హరికృష్ణారెడ్డి కలిగిరి నుంచి మాచర్ల వరకు ఎదురెళ్లి అక్కడి నుంచి స్వయంగా బస్సు నడిపాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లా కలిగిరిలో హరికృష్ణ ట్రావెల్స్ పేరుతో హరికృష్ణారెడ్డి బస్సులు నడుపుతున్నాడు. ఈ బస్సులకు ఎప్పుడూ ఏదో ఒక మరమ్మతు వస్తోందని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు వచ్చే బస్సులను తెచ్చుకుని, వాటికి పైపై మెరుగులు దిద్ది ట్రావెల్స్ నడుపుతున్నాడనే పేరుంది. మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైన బస్సు (ఏఆర్ 20డీ 0487) కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరైంది. ఈ బస్సు జగిత్యాలలో బయలుదేరిన దగ్గర నుంచి మొరాయిస్తూనే ఉంది. స్టార్టింగ్ సమస్య ఉందంటూ బ్యాటరీ మరమ్మతులు చేస్తూ డ్రైవర్ బస్సును ముందుకు తీసుకొచ్చాడు. అవసరమైతే వేరే బస్సులో ఎక్కిస్తానని ప్రయాణికులకు చెప్పాడు కూడా.
మధ్యలో భోజనానికి ఆపిన సమయంలో కూడా బస్సు ఇంజిన్ ఆపితే మళ్లీ స్టార్ట్ కాదనే ఉద్దేశంతో రన్నింగ్‌లోనే ఉంచాడని ప్రయాణికులు చెబుతున్నారు. తర్వాత సెన్సార్ పనిచేయలేదని కొన్నిసార్లు, స్టీరింగ్ పట్టుకుంటోందని పలుమార్లు చెబుతూ విషయాన్ని యజమాని హరికృష్ణారెడ్డికి తెలియజేసినట్టు సమాచారం. దీంతో మాచర్ల వరకు ఎదురు వెళ్లిన హరికృష్ణారెడ్డి అక్కడి నుంచి బస్సును నడుపుతూ ఎర్రగొండపాలెం వచ్చిన తర్వాత కొంతసేపు మళ్లీ మరమ్మతు పేరుతో నిలిపివేశాడు. అక్కడ కూడా వేరే బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తామని చెప్పి మళ్లీ బయలుదేరాడు. మార్కాపురం దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను వేగంగా ఢీకొట్టాడు. సెన్సార్ పనిచేయని కారణంగా స్టీరింగ్ స్ట్రక్ అయినట్టు డ్రైవర్ యువరాజు చెబుతున్నాడు. ప్రమాదం జరగ్గానే బస్సు నుంచి దూకి ఓనర్ హరికృష్ణారెడ్డి కలిగిరికి పరారైనట్టు తెలిసింది. కాగా, హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని మార్కాపురం జిల్లా పామూరు పోలీసులు గురువారం సాయంత్రం కలిగిరిలో అదుపులోకి తీసుకున్నారు. కలిగిరిలోని హరికృష్ణ ట్రావెల్స్ కార్యాలయం మూతపడింది. కార్యాలయం పక్కనే మరమ్మతులకు గురైన రెండు బస్సులు, వస్తువులు ఎక్కడికక్కడే ఉన్నాయి.
ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రులు
బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు డీఎ్‌సబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం వారు పరామర్శించారు. బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 28 మంది గాయపడిన విషయం విదితమే. వారిలో తీవ్రంగా గాయపడి కాళ్లు, చేతులు విరిగిన, శరీరం బాగా కాలిపోయిన 14 మంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రులు వారిని పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై రిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించిందని, సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు మార్కాపురం వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించినట్టు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇస్తుందని తెలిపారు.