ఆరేళ్లుగా కొండలా పేరుకున్న బకాయిలు
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:34 AM
రాష్ట్రంలో వివిధ శాఖల్లో 12.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని వారి ప్రతి డిమాండ్ పరిష్కారం ఓ ప్రసవ వేదనతో సమానమని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు.
ఏపీ ఎన్జీవోలో యువ ఉద్యోగులకు ప్రాధాన్యం: విద్యాసాగర్
గుంటూరు (విద్య) ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ శాఖల్లో 12.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని వారి ప్రతి డిమాండ్ పరిష్కారం ఓ ప్రసవ వేదనతో సమానమని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఆదివారం గుంటూరులో ది స్కూల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాసాగర్ మాట్లాడుతూ, గత ఆరేళ్లుగా ఉద్యోగులకు సంబంధించిన వివిధ రకాల బకాయిలు ప్రభుత్వం వద్ద కొండలా పెరిగిపోయాయని తెలిపారు. ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం లేకుండా సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని, కుదరని పక్షంలో పోరాటానికి సన్నద్థమవుతామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పీఆర్సీ వేయలేదని, మరి కొద్ది రోజులు ఎదురుచూసి కార్యాచరణ సిద్థం చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా యువతను ఆఫీస్ బేరర్లుగా నియమించామని వెల్లడించారు. స్కూల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అమరావతి ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని విద్యాసాగర్ తెలిపారు.