Share News

AP TET Examination: ‘టెట్‌’లో 52శాతం మంది టీచర్లు ఫెయిల్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 06:02 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు హాజరైన టీచర్లలో 52.18 శాతం మంది ఫెయిలయ్యారు. తాజాగా విడుదల చేసిన టెట్‌ ఫలితాల్లో 31,886 మంది ఉపాధ్యాయులకుగాను...

AP TET Examination: ‘టెట్‌’లో  52శాతం మంది టీచర్లు ఫెయిల్‌

  • 47.82 శాతం మంది మాత్రమే పాస్‌

  • 31,886 మందికి 15,239 మంది ఉత్తీర్ణత

  • పాస్‌ కాని వారికి రెండేళ్ల వరకు గడువు

  • సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్‌ పరీక్ష

  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు హాజరైన టీచర్లలో 52.18 శాతం మంది ఫెయిలయ్యారు. తాజాగా విడుదల చేసిన టెట్‌ ఫలితాల్లో 31,886 మంది ఉపాధ్యాయులకుగాను 15,239 (47.82 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 16,647 మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. అయితే, టీచర్లు కాని వారి ఉత్తీర్ణతతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. సాధారణ అభ్యర్థులు 2,48,427 మంది టెట్‌ రాయగా వారిలో 97,560(39.27శాతం) మాత్రమే అర్హత సాధించారు. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే టీచర్లు 9 శాతం అదనంగా పాసయ్యారు. టెట్‌-2025 ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం ‘ఎక్స్‌’లో విడుదల చేశారు. ఇన్‌ సర్వీసు టీచర్లు కాకుండా ఇతర అభ్యర్థులు 2,71,692 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1(ఏ)కు 1,06,747 మంది, పేపర్‌-1(బీ)కి 2,497 మంది, పేపర్‌-2(ఏ)కు 1,59,146 మంది, పేపర్‌-2(బీ)కి 3,302 మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్‌ ఆధారంగా డిసెంబరు 10 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో మొత్తం 133 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. కాగా సాధారణ అభ్యర్థులు 2,48,427 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 97,560 మంది అర్హత సాధించారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లు 31,886 మంది రాస్తే 15,239 మంది అర్హత సాధించారు. గత నాలుగు టెట్‌లను పరిశీలిస్తే ఈ సారి అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గత నాలుగు టెట్‌లలో కనీసం 50 శాతం ఉత్తీర్ణత వచ్చింది.


సుప్రీం తీర్పుతోనే..

2011కు ముందు టెట్‌ లేకుండా నేరుగా డీఎస్సీ పరీక్షతో టీచర్‌ నియామకాలు చేపట్టారు. టెట్‌ వచ్చిన తర్వాత తొలుత టెట్‌ అర్హత సాధించి, ఆ తర్వాత డీఎస్సీ రాయాలి. అయితే ఓ కేసులో గతేడాది సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో టెట్‌ లేకుండా ఉద్యోగాలు పొందిన టీచర్లంతా తప్పనిసరిగా అర్హత పరీక్ష రాయాల్సిందేనని ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది టీచర్లు టెట్‌ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 1,27,802 మందికి టెట్‌ లేదు. అయితే సుప్రీంకోర్టు తీర్పులో ఐదేళ్లలోపు రిటైర్‌ అయ్యేవారికి మినహాయింపు ఇచ్చారు. దీంతో 1,04,595 మంది తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాల్సి ఉంది. కాగా, దీనిపై సుప్రీంలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మినహాయింపు లభిస్తుందని దేశవ్యాప్తంగా టీచర్లు ఎదురుచూస్తున్నారు. అయితే.. అర్హత సాధించడం మేలని ఆలోచించి రాష్ట్రంలో 31,886 మంది టెట్‌ రాయగా వారిలో కేవలం 47.82 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన 89,356 మంది టీచర్లు రాష్ట్రంలో టెట్‌ అర్హత సాధించాల్సి ఉంది. వారికి రెండేళ్ల వరకు గడువు ఉంది. అయితే, ఈలోగా సుప్రీంకోర్టులో మినహాయింపు లభిస్తే టెట్‌ రాసే అవసరం ఉండదు.

Updated Date - Jan 10 , 2026 | 06:02 AM