Share News

లెవలింగ్‌పై చర్యలేవీ?

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:56 AM

గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న కాలనీల చదును పనుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా అక్రమ సొమ్మును వైసీపీ కార్యకర్తల నుంచి వసూలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారు.

లెవలింగ్‌పై చర్యలేవీ?

  • 400 కోట్లు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ

  • నాడు జగనన్న కాలనీల చదును పనుల్లో వైసీపీ శ్రేణుల నొక్కుడు

  • రికవరీకి గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశం

  • అక్రమార్కులకు తహశీల్దార్లు, హౌసింగ్‌ అధికారుల వత్తాసు

  • ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేయని కలెక్టర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న కాలనీల చదును పనుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా అక్రమ సొమ్మును వైసీపీ కార్యకర్తల నుంచి వసూలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4500 లెవలింగ్‌ పనులకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ తనిఖీలు చేసింది. అక్రమాలు జరిగినట్టు నిర్ధారించి, రికవరీలకు రెవెన్యూ శాఖకు పంపినా ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. కలెక్టర్లు ఆయా తహశీల్దార్లకు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేయాలని ఆదేశాలిచ్చినా... పలువురు తహశీల్దార్లు స్థానిక నాయకులు, వైసీపీ కార్యకర్తల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వారిని రక్షించేందుకు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఉపాధి హామీ పథకంలో అనుమతి లేకపోయినా జగనన్న కాలనీల్లో చదును పనులకు అప్పట్లో సహకరించిన అధికారులు కొందరు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గ్రామీణాభివృద్ధిశాఖ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం పనులు తనిఖీలు చేసి రికవరీ చేయాలంటూ డ్వామా పీడీలకు నివేదికలు అందిస్తున్నా.. కొందరు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇక చాలా మంది కలెక్టర్లు ఈ అక్రమాల గురించి పట్టించుకోవడం లేదని, ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేయడంలో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.


పనులు చేయకున్నా బిల్లులు

రాష్ట్రవ్యాప్తంగా 9384 జగనన్న కాలనీల లెవలింగ్‌ పనులపై క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తనిఖీలు చేపడుతోంది. 4336 పనులకు తనిఖీలు నిర్వహించి, రికవరీ చేయాలంటూ ఆయా డ్వామా పీడీలకు సూచించింది. అయితే ఈ లోపు తమకు బిల్లులు చెల్లించాలంటూ 367 పనులకు సంబంధించి 106 మంది వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది కోర్టు ఆదేశాలతో చేయని పనులకు సైతం బిల్లులు పొందారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో ఓ జగనన్న కాలనీలో ఇప్పటికీ నీళ్లు నిలిచి ఉన్నాయి. అక్కడ తనిఖీ చేసే అవకాశమే లేదు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు.. పనులు చేయకపోయినా వారికి పూర్తి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని మండలాల్లో అయితే 10 శాతం పనులు చేపట్టి వందశాతం బిల్లులు పొందే ప్రయత్నాలు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో 38 జగనన్న కాలనీల్లో లెవలింగ్‌ పనులు చేపట్టగా, అందులో 37 కాలనీలు అసలు నివాసానికే యోగ్యత లేనివి. ఈ పనులకు సంబంధించి రూ.2.58 కోట్లు పనులు చేసినట్లు ఎంబుక్‌లు రికార్డు చేయించుకున్నారు. ఇప్పటికే రూ.1.03 కోట్లు చెల్లింపులు జరిగాయి. అయితే అధికారులు తనిఖీ చేపట్టిన తర్వాత అక్కడ రూ.38.21 లక్షల పనులు మాత్రమే జరిగాయని నిర్ధారణ అయింది. దీంతో వైసీపీ నేతలకు చెల్లించిన మొత్తంలో రూ.65.34 లక్షలు రికవరీ చేయాలని చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ నెల్లూరు డ్వామా అధికారులను ఆదేశించారు. అయితే అక్కడి తహశీల్దార్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడ చేపట్టిన పనులకు సంబంధించి రికార్డు చేసిన మొత్తంలో 12 శాతం మాత్రమే చేసి వంద శాతం బిల్లులు కొట్టేయాలన్న ప్రయత్నాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


కూటమిలోనూ వైసీపీ నేతల హవా

రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. జగనన్న హౌసింగ్‌ కాలనీలకు ఒక్క ట్రాక్టర్‌ మట్టి కూడా తోలకుండానే బిల్లులు లాగేసుకుంటున్నారు. హౌసింగ్‌ అధికారుల అండతో కోర్టులకు తప్పుడు సమాచారమిచ్చి ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. ఉపాధిలో అనుమతి లేని పనులు చేశారంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మొట్టికాయలు వేయడంతో అప్పట్లో జగన్‌ ప్రభుత్వం ఈ పథకం నిర్వహణను గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి హౌసింగ్‌ విభాగానికి బదిలీ చేసింది. చదును చేయకుండానే పెట్టిన బిల్లులను కూడా వైసీపీ నేతలకు ఇప్పించేందుకు హౌసింగ్‌ అధికారులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ అక్రమాలను నివారించలేని పరిస్థితి ఏర్పడింది.


కొనసాగుతూనే ఉన్న తనిఖీలు..

గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటి స్థలాల లెవలింగ్‌పై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో చర్చ, పత్రికల్లో కథనాలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ఆయన ఆదేశాలతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆ పనులు తనిఖీ చేయాలని, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఈఈలు, ఉపాధి పథకం సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు, అవసరమైన చోట ఇతర శాఖల ఇంజనీర్లతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేసి సిఫారసులు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఆయా జిల్లాల్లో 25 శాతం పెండింగ్‌ చెల్లింపుల పనుల జాబితాను డ్వామా పీడీల నుంచి సేకరించాలని, నిబంధనల ప్రకారం పనులు జరిగాయా? లేదా? పంచాయతీలకు సీనరేజ్‌ చార్జీలను చెల్లించారా లేదా? తదితర నిబంధనలను తనిఖీ సందర్భంగా పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఇంటి స్థలాల లెవలింగ్‌ పనుల బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. అయితే కమిషనర్‌ ఆదేశించి 10 నెలలు అవుతున్నా ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాల్లో కొన్ని చోట్ల గతంలో పనులు నిర్వహించిన సందర్భంలో ఉన్న అధికారులే ఇప్పటికీ అక్కడే ఉండటంతో విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అటు హౌసింగ్‌ అధికారులు, ఇటు కొంతమంది క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బంది సహకారంతో వైసీపీ నేతలకు చేయని పనులకు బిల్లులు పొందే అవకాశమేర్పడింది.

Updated Date - Apr 21 , 2026 | 05:00 AM