Share News

తహశీల్దార్లు ఏరీ?

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:24 AM

రెవెన్యూ అంటేనే.. భూ వివాదాలమయం. భూ సమస్యలు పరిష్కారం గాక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సమస్యల నుంచి బయటపడతామా అని ఎదురు చూస్తున్నారు.

తహశీల్దార్లు ఏరీ?

  • 337 మండలాల్లో ఆ పోస్టులు ఖాళీ

  • ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్ల కొరత

  • సగానికి సగం మండల ఆఫీసులు ఖాళీ

  • మరో 28 మండలాల్లో ఇన్‌చార్జిల పాలన

  • పరిమితికి మించి డీసీలుగా పదోన్నతులు

  • పదోన్నతులు, నియామకాలు లేని వైనం

  • ప్రజల గోడు వినే అధికారులే లేరు

  • వివాదాల పరిష్కారాలు, సేవలు ఎలా?

  • అయినా సీఎంకు ఫీల్‌గుడ్‌ నివేదికలు

రాష్ట్రంలో 680 మండలాలు ఉండగా, దాదాపు సగం మండలాలకు అంటే.. 337 చోట్ల రెగ్యులర్‌ తహశీల్దార్లు లేరు. పోనీ మిగిలిన 343 మండలాలకు అయినా రెగ్యులర్‌ అధికారులు ఉన్నారా అంటే.. అదీ లేదు. కొన్ని మండలాల్లో ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరిల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి.

భూ సమస్యలు పరిష్కరించడంలో తహశీల్దార్‌ కీలకం. అంతేగాక రెవెన్యూ శాఖ నుంచి ప్రజలకు ఎన్నో రకాల సేవలు అవసరం. రెవెన్యూలో మండల స్థాయిలో అత్యంత కీలకమైన తహశీల్దార్‌ ఆఫీసుల్లో రెగ్యులర్‌ అధికారులు లేకపోతే సమస్యలు పరిష్కారం ఎలా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రెవెన్యూ అంటేనే.. భూ వివాదాలమయం. భూ సమస్యలు పరిష్కారం గాక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సమస్యల నుంచి బయటపడతామా అని ఎదురు చూస్తున్నారు. రెవెన్యూలో పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నప్పుడే భూ వివాదాలు పరిష్కరించడం ఆ శాఖకు సాధ్యం కాలేదు. అలాంటిది.. ఇప్పుడు సగానికి సగం రెవెన్యూ ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. మరి ప్రజల గోడు వినేదెవరు? ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన తహశీల్దార్‌ పోస్టులు పెద్దఎత్తున ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 680 మండలాలు ఉండగా, దాదాపు సగం మండలాలకు రెగ్యులర్‌ తహశీల్దార్లు లేరు. కీలకమైన క్షేత్రస్థాయి పోస్టులను సుదీర్ఘకాలంగా ఖాళీగా పెట్టిన రెవెన్యూ శాఖ.. తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడంలో మాత్రం ఎనలేని ఆసక్తి చూపిస్తోంది. దీంతో మంజూరైనపోస్టులకంటే రెండు రెట్లు ఎక్కువగా డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వారిని ఎక్కడ సర్దుబాటు చేయాల్నో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. అవసరం ఉన్న తహశీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ), సీనియర్‌ అసిస్టెంట్‌ వంటి క్షేత్రస్థాయి పోస్టులపై ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో రెవెన్యూ ఆఫీసులకు ప్రజలు వెళ్తే వారి నుంచి పిటిషన్లు తీసుకొని పరిష్కరించే అధికారులే కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే భూముల సర్వేను కొనసాగిస్తున్నారు. దీంతో ఉన్న కొద్దిపాటి అధికారులు కూడా ఆఫీసు పనికన్నా రీ సర్వేపైనే దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా మండల స్థాయిలో రెవెన్యూ సేవలు కుదేలవుతున్నాయి. వాస్త వం ఇలా ఉంటే.. అధికారులు మాత్రం సంస్కరణల బాటలో రెవెన్యూ శాఖ పరుగులు తీస్తోందని, అద్భుతమైన మార్పులు వస్తున్నాయని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కలర్‌ఫుల్‌ నివేదికలు ఇస్తున్నారు. ఇవి నిజమే అని నమ్మిన ముఖ్యమంత్రి ఏడాది వ్యవధిలోనే అంటే.. వచ్చే మార్చి నాటికి ఏపీని భూ వివాదాలే లేని రాష్ట్రంగా మారుస్తామని ప్రతినబూనారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం గా ఉందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థే సమగ్రంగా లేనప్పుడు భూ వివాదాలను ఎలా పరిష్కరిస్తారు? ఇది సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా సమస్యలు

జగన్‌ ప్రభుత్వం 2020లో రీ సర్వే ప్రారంభించింది. ఆ సమయంలో తహశీల్దార్‌ ఆఫీసుల్లో ఉన్న సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలకు రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్‌ (ఆర్‌ఎ్‌సడీటీ)లుగా పదోన్నతులు కల్పించారు. వారిని మండలాల్లో నియమించారు. రీ సర్వేలో వచ్చే వివాదాల పరిష్కారం కోసం వారికి న్యాయాధికారాలు కూడా కల్పించారు. కానీ ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో జగన్‌ సర్కారు చేపట్టిన రీసర్వే వల్ల 6వేల గ్రామాల్లో 8.75 లక్షల సమస్యలు వచ్చాయి. నాడు ఏర్పడిన ఖాళీలను నియామకాలు, పదోన్నతుల ద్వారా భర్తీ చేయలేదు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత తహశీల్దార్‌ ఖాళీలు 337కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 680 మండలాలు ఉండగా, అందులో 337 మండలాలకు రెగ్యులర్‌ తహశీల్దార్లు లేరు. ఆ మండలాల్లో పనిచేస్తున్న తహశీల్దార్లు ఎవరంటే.. రీ సర్వే కోసం పనిచేయాల్సిన ఆర్‌ఎ్‌సడీటీలు. మిగిలిన 343 మండలాల్లోనూ 28 మండలాలకు ఇన్‌చార్జి అధికారులే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రీ సర్వే కొనసాగుతోంది. మండలాల్లో ఆర్‌ఎ్‌సడీటీల అవసరం ఉంది. వారిని కదిలించడానికి వీల్లేదు. అయినా పలు జిల్లాల్లో కలెక్టర్లు ఆర్‌ఎ్‌సడీటీలను ఇన్‌చార్జి తహశీల్దార్లుగా నియమించారు. దీంతో రీ సర్వేలో వచ్చే వివాదాల పరిష్కారం అటకెక్కింది.


పదోన్నతుల్లో గందరగోళం

రాష్ట్రంలో డీటీలు చాలా మందే ఉన్నారు. గత 9 ఏళ్లుగా డీటీలు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఆ ఆవకాశం కల్పించి పదోన్నతి ఇస్తే రాష్ట్రంలో ఉన్న తహశీల్దార్‌ ఖాళీలన్నీ భర్తీ అవుతాయి. కొత్తగా ఏర్పడే డీటీ ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా 30 శాతం, సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 70 శాతం భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఆ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేయకపోగా, ఇప్పటికే తహశీల్దార్లుగా పనిచేస్తున్న అనేక మందికి రకరకాల కారణాలను చూపి డిప్యూటీ కలెక్టర్‌ పదోన్నతులు అడహాక్‌గా ఇచ్చారు. దీంతో తహశీల్దార్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందగానే అధికారులు జిల్లా స్థాయి పోస్టులకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా మండల ఆఫీసుల్లో పనిచేసే అధికారుల కొరత మరింతగా పెరిగిపోతోంది. ప్రస్తుతం 400 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారని అంచనా.


సీఎంకు ఫీల్‌గుడ్‌ నివేదికలు

క్షేత్రస్థాయిలో రెవెన్యూ పాలన కుంటుపడగా.. అధికారుల నివేదికలు, కార్యాచరణ అందుకు భిన్నంగా ఉన్నాయి. రెవెన్యూ పటిష్ఠంగా ఉందని, ప్రజల భూ సమస్యల పరిష్కారం చాలా వేగంగా జరుగుతోందని సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదికలు ఇస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ అధికారులు క్షేత్రస్థాయి సమస్యలు నివేదించకుండా, రీ సర్వే ఇబ్బందులు, రైతుల అగచాట్లను పేర్కొనకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు రంగుల ప్రపంచం చూపించారు. అంతిమంగా దాని ఫలితం ఆ ప్రభుత్వం మూటగట్టుకుంది. ఇప్పుడూ అధికారులు అదే పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. రోజువారీగా చేసే పనులు కూడా చేయకుండానే అంతా బాగుందని ఫీల్‌గుడ్‌ నివేదికలు ఇస్తున్నారని అధికారవర్గాలే చెబుతున్నాయి.

రెవెన్యూ కీలకం

రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనది. నూటికి 90 శాతం మంది ప్రజలు ఈ శాఖ సేవలను పొందుతారు. అలాంటి శాఖకు మండల తహశీల్దార్‌ ఆఫీసులే కీలకం. మండల ఆఫీసుల నియంత్రణలో గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో), సర్వేయర్లు ఉన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ (డీటీ), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ), ఆఫీసు సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్‌ పోస్టు అత్యంత కీలకమైనది. మండల స్థాయిలో న్యాయాధికారాలు ఉన్న ఏకైక అధికారి తహశీల్దారే. ఇతర శాఖలపై కూడా తహశీల్దార్‌కు అజమాయిషీ ఉంటుంది.

Updated Date - Mar 28 , 2026 | 04:27 AM