Tirumala: రెండు రోజుల్లో 1.37 లక్షల మందికి దర్శనం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:54 AM
తిరుమలలో తొలిసారి ఏ ఒడిదొడుకులూ లేకుండా ప్రశాంతంగా తొలి రెండు రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి.
తిరుమలలో ప్రశాంతంగా టోకెన్ వైకుంఠ ద్వార దర్శనాలు
నేటి నుంచి టోకెన్ రహిత దర్శనాలు
తిరుమల, జనవరి 1(ఆంధ్రజ్యోతి): తిరుమలలో తొలిసారి ఏ ఒడిదొడుకులూ లేకుండా ప్రశాంతంగా తొలి రెండు రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో శ్రీవారిని 1,37,309 మంది దర్శించుకున్నారు. 30న ఏకాదశి రోజు 67,053 మంది, 31న ద్వాదశి రోజు 70,256 మంది శ్రీవారిని దర్శించుకుని ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. గతంతో పోలిస్తే ఈ రెండు రోజుల్లో 24,202 మంది భక్తులు అదనంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా శుక్రవారం వేకువజాము నుంచి తిరుమలలో టోకెన్ రహిత సర్వదర్శనాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఆన్‌లైన్‌లో టోకెన్లు పొందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన, శ్రీవాణి భక్తులనూ దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమలలో పెరిగిన రద్దీ
శుక్రవారం నుంచి సర్వదర్శనాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం సాయం త్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈసారి ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పూర్తయినప్పటికీ టోకెన్లు పొందలేకపోయిన చాలా మంది గోవిందమాల భక్తులు 2వ తేదీన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచి తిరుమలలో రద్దీ వాతావరణం నెలకొంది. టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు పూర్తయితే ముందస్తుగానే సర్వదర్శనాలు ప్రారంభించేలా రాత్రి నుంచే వీరిని కంపార్టుమెంట్లలోకి అనుమతిస్తున్నారు.