Share News

జీడీడీపీలో మన ర్యాంకు 18

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:04 AM

జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ) వృద్ధి రేటులో నంద్యాల జిల్లా 18వ స్థానంలో నిలిచింది.

జీడీడీపీలో మన ర్యాంకు 18
సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌

2025-26 జీడీడీపీ లక్ష్యం రూ.50,702 కోట్లు

ఇప్పటికి సాధించినది రూ.48,466 కోట్లు

గతం కంటే కాస్త మెరుగు

ప్రజాభిప్రాయ సేకరణలో 20వ స్థానం

పోలీస్‌ శాఖలో గణనీయమైన పురోగతి

ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించిన ఎస్పీ సునీల్‌ షెరాన

కలెక్టర్ల సదస్సులో నివేదిక విడుదల

నంద్యాల, మార్చి11(ఆంధ్రజ్యోతి): జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ) వృద్ధి రేటులో నంద్యాల జిల్లా 18వ స్థానంలో నిలిచింది. పారిశ్రామిక, సేవా రంగాతో పాటు వ్యవసాయ రంగంలోనూ కాస్త మెరుగుదల కనిపించింది. అదే క్రమంలో జిల్లా తలసరి ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో మెరుగైన స్థానం సాధించింది. జిల్లా తలసరి ఆదాయం 2,27,307 అంచనా వేయగా 2,27,054 సాధించి 20వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో నంద్యాల జిల్లా 22వ స్థానంలో నిలవగా ప్రస్తుతం కాస్త మెరుగుపడినట్లయింది. ఈ సదస్సుకు జిల్లా మంత్రులు ఎనఎండీ ఫరూక్‌, బీసీ జనార్ధన రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా జీడీడీపీలో ఏస్థాయిలో ఉన్నాం..? వివిధ రంగాల్లో సాధించిన పురోగతి ఎంత..? వంటి అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

ఫ 18వ స్థానంలో జిల్లా స్థూల ఉత్పత్తి

జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీడీపీ)లో జిల్లాకు గత ఏడాది మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 18వ స్థానమే దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమం, అభివృద్ధి, తదితర రంగాల్లో అధికారుల పనితీరు మెరుగ్గా ఉండటంతో జిల్లాకు ప్రత్యేక గురింపు లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో జిల్లా జీవీఏ పరిశీలిస్తే.. రూ.50,702 కోట్లు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.48,466 కోట్లు మాత్రమే సాధించింది. ఈ నెల ఆఖరిలోపు రూ.2,236 కోట్లు సాధించినట్లయితే టార్గెట్‌ పూర్తవుతుంది. ఈ విభాగంలో ఇప్పటి వరకు జిల్లాకు రాష్ట్రంలో 18వ స్థానం దక్కింది. కాగా గత ఏడాదిలో కూడా రూ.43,694 కోట్లు సాధించిన 10.92 శాతం పురోగతితో ఇదే స్థానంలో నిలవడం విశేషం. మొత్తంగా గత సమావేశం అనంతరం ప్రస్తుతం కాస్త మెరుగ్గా కనిపించింది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు.

ఫ వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగు

వ్యవసాయ రంగం స్థూల ఉత్పత్తి 2025-26 లక్ష్యంలో ఇప్పటి వరకు 9.87 శాతం పురోగతి సాధించడంతో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 13వ స్థానం దక్కింది. అదే విధంగా పారిశ్రామిక రంగం పరంగా లక్ష్యంలో 9.48 శాతం పురోగతి సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 18వ స్థానం లభించింది. ఇక సేవా రంగం పరంగా పరిశీలిస్తే.. లక్ష్యంలో ఇప్పటి వరకు 11.77 శాతం పురోగతి సాధించి 18వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా ఈ నెల ఆఖరిలోపు ఆయా రంగాల పరంగా మరింత పురోగతి సాధించి 2025-26 లక్ష్యాన్ని సాధించాలని దిశ నిర్ధేశం చేశారు. కాగా జీడీడీపీలోని కీ ఫర్మామెన్స ప్రకారం రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే.. వ్యవసాయం రంగంలో 87 పాయింట్లతో ఏ గ్రేడ్‌, పారిశ్రామిక రంగంలో 84 పాయింట్లతో ఏ గ్రేడ్‌, సేవా రంగంలో 81 పాయింట్లతో ఏ గ్రేడ్‌లో జిల్లా నిలిచింది. అదేవిధంగా కీలక పనితీరు సూచికల (కేపీఐ) పరంగా.. జిల్లా 87 పాయింట్లతో ఏ గ్రేడ్‌లో నిలిచింది. ఇదిలా ఉండగా.. ప్రజాభిప్రాయ సేకరణ పరంగా గత డిసెంబరులో 66.9 శాతం పాజిటీవ్‌ అభిప్రాయం రాగా.. ప్రస్తుతం 68.7 శాతంతో రాష్ట్రంలో జిల్లాకు 20 స్థానం దక్కింది.

ఫ ఆశాజనకంగా వివిధ రంగాలు..

ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్‌ గవర్నెన్సలో భాగంగా గత నెలలో 9,178 సేవలందించి నంద్యాల జిల్లా 11వ స్థానంలో నిలిచింది. అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్‌ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. అట్టడుగున పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి. గత వారం రోజుల్లో మాత్రం 1,935 సేవలతో 9వ స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. అదేవిధంగా పీజీఆర్‌ఎస్‌ పరంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండు నెలల ఫిర్యాదులు పరిశీలిస్తే.. 6,305 ఫిర్యాదులను పరిష్కరించి 94 శాతంతో జిల్లా 15వ స్థానంలో నిలిచింది.

ఫ పోలీస్‌ శాఖకు సంబంధించి నంద్యాల జిల్లా గణనీయమైన పురోగతి సాధించింది. ఎస్పీ సునీల్‌ షెరాన దృష్టికి వచ్చిన ఫైళ్లను క్లియర్‌ చేసి 9వ స్థానంలో నిలిచారు. 221 ఫైళ్లలో 202 ఫైళ్లను ఆయన త్వరితగతిన పరిష్కరించగలిగారు. నాలుగు రోజుల 10 గంటల 52 నిమిషాల్లో ఫైళ్లను పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు.

Updated Date - Mar 12 , 2026 | 12:04 AM