మండలిలో అదే సీన్!
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:38 AM
రాష్ట్ర శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన సోమవారం కూడా కొనసాగింది. ఉదయం 10.04 గంటలకు సభ ప్రారంభం కాగానే... టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా...
ఇందాపూర్ నెయ్యి, తిరుమల లడ్డూపై వాయిదా తీర్మానాల తిరస్కరణ
అయినా చర్చించాలని పోడియాన్ని చుట్టుముట్టిన విపక్ష ఎమ్మెల్సీలు
రాజమండ్రి కల్తీపాలఘటనపై అనిత ప్రకటన
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన సోమవారం కూడా కొనసాగింది. ఉదయం 10.04 గంటలకు సభ ప్రారంభం కాగానే... టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా, తిరుపతి లడ్డూ ప్రసాదంపై వైసీపీ సభ్యులు అరుణ్‌కుమార్, శివరామిరెడ్డి, సూర్యనారాయణరాజు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో వైసీపీ సభ్యులు చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టారు. రోజూ ఇదే బిజినెస్ కాదు.. కూర్చోండంటూ ఆయన వారిని వారించారు. వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు సార్వత్రిక ఆరోగ్య బీమాపై అడిగిన ప్రశ్నకు.. వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సమాధానం చెబుతుండగానే.. వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి, ఇందాపూర్ డెయిరీపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. తిరస్కరించిన అంశంపై చర్చకు తావు లేదని చైర్మన్ స్పష్టం చేశారు. ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చ జరగాలి.. ఈ డెయిరీల పాలు-నెయ్యి కల్తీ.. ఆలీబాబా-బోలేబాబా, గోవిందా-గోవిందా అంటూ వారు నినాదాలు చేశారు. ఆలపాటి మాట్లాడుతూ.. సభ్యుల ప్రశ్నలకు సమాధానం రాబట్టకుండా అడ్డుకుంటున్నారని.. పెద్దల సభ మర్యాదను మంటగలిపేలా విపక్ష సభ్యులు పోడియంపైకి ఎక్కడం సరికాదని, మార్షల్స్‌ను పిలిచి దించేయాలని సూచించారు. అధికారపక్ష సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి.. విపక్షాన్ని ఆపండి.. సభ సజావుగా నడిచేందుకు చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు. అధికార, విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో 10.10 గంటలకు పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
సుమారు నాలుగు గంటల సుదీర్ఘ విరామం తర్వాత మధ్యాహ్నం 2.02 గంటలకు సభ పునఃప్రారంభమైంది. సభ్యుల విజ్ఞప్తి మేరకు రెండు ప్రశ్నలు వాయిదా వేసి.. మిగతా ప్రశ్నలకు సమాధానాలను సభ్యులకు అందించనున్నట్లు చైర్మన్ తెలిపారు. ప్రత్యేక అంశాల ప్రస్తావనకు అనుమతిచ్చారు. వైసీపీ సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో నలుగురు మృతి చెందిన ఘటనపై హోం మంత్రి అనిత ప్రకటన చేశారు. దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం మండలి సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
విచ్చలవిడిగా పాల కల్తీ: బొత్స
రాష్ట్రంలో విచ్చలవిడిగా పాల కల్తీ జరుగుతోందని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..సభలో వేంకటేశ్వరస్వామి ఫొటోలను తాము చెప్పులు ధరించి పట్టుకున్నట్లు వీడియో ఫుటేజీ బయటకు వచ్చిందని.. చైర్మన్ తమకు చూపించిన పుటేజీలో ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారు. తమకు శుక్రవారం సభ జరిగిన సీసీ పుటేజీ మొత్తం ఇవ్వాలని, ఫొటోలు ఎలా మార్ఫింగ్ చేశారో తేల్చాలని చైర్మన్‌ను కోరామన్నారు.