‘ఆపరేషన్ చిన్నారి తల్లి’
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:40 AM
చిన్నారులు, మహిళలపై తరచూ లైంగిక నేరాలకు పాల్పడే ‘సెక్సువల్ అఫెండర్స్’తోపాటు గంజాయి బానిసలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు.
సురక్షిత బాల్యంతోనే సుస్థిర అభివృద్ధి: డీజీపీ
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): చిన్నారులు, మహిళలపై తరచూ లైంగిక నేరాలకు పాల్పడే ‘సెక్సువల్ అఫెండర్స్’తోపాటు గంజాయి బానిసలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు. నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీవించే పిల్లల తల్లులతో పాటు అంగన్‌వాడీలు, విద్యాసంస్థల్లో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. గురువారం మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ పోస్టర్‌ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సురక్షిత బాల్యంతోనే సుస్థిర అభివృద్ధి’ అనే నినాదంతో రాష్ట్రంలోని బాలికల రక్షణ కోసం ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ‘లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తులు, గంజాయి బానిసల్ని గుర్తించి, వారిపై నిఘా పెట్టాం. అవసరం మేరకు స్థానిక పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. గస్తీ పెంచుతారు. ఫోక్సో కేసుల్లో నిందితుల అరెస్టు నుంచి చార్జిషీటు నమోదు వరకూ సకాలంలో పూర్తి చేస్తారు. నేరస్తులకు సత్వర శిక్షలు పడేందుకు విచారణను వేగవంతం చేస్తారు. అన్ని జిల్లాల ఎస్పీలకు, కమిషనర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. రాష్ట్రపోలీసుశాఖలోని ఉమెన్ సేఫ్టీ విభాగం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది’ అని డీజీపీ వివరించారు. కార్యక్రమంలో శాంతి భద్రతల ఏడీజీ మధుసూదన్ రెడ్డి, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.