నేటి నుంచి ‘ఓపన ఇంటర్’ పరీక్షలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:57 PM
జిల్లాలో సోమవారం నుంచి 13వ తేదీ వరకు ఓపన స్కూల్స్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
నంద్యాల ఎడ్యుకేషన, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి 13వ తేదీ వరకు ఓపన స్కూల్స్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈసారి అధికారులు, సిబ్బందిని కాకుండా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం నుంచి నియమించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డీవోలను నియమించారు. నంద్యాల జిల్లాలో మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలుండగా 867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నంద్యాలలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 215 మంది, డోన బాలికల జడ్పీ హైస్కూలులో 167 మంది, జడ్పీ పాతపేట బాయ్స్ హైస్కూల్‌లో 168 మంది, ఆత్మకూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 150 మంది, బాలికల జడ్పీ హైస్కూల్‌లో 158 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో స్థానికంగా తమకు అనుకూలమైన వారిని పరీక్షా కేంద్రాలకు ఛీఫ్‌లు, డీవోలు, ఇన్విజిలేటర్‌లను నియమించుకుని మాస్‌కాపీయింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. కొందరు స్టడీసెంటర్‌ల కోఆర్డినేటర్‌లు పాస్ గ్యారెంటీ పేరుతో అభ్యర్థుల నుంచి వేలాదిరూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ఏడాది నుంచి పరీక్షల నిర్వహణకు సంబంధించిన నియామకాలన్నింటినీ డీజీఈ కార్యాలయమే పర్యవేక్షిస్తోంది. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నంద్యాల జిల్లా ఓపన స్కూల్స్ కోఆర్డినేటర్ రఘురామిరెడ్డి వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, 8 నుంచి 9 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.
ఫ 16వ నుంచి ‘పది’ పరీక్షలు : 16వ తేదీ నుంచి 28వ తేదీ నుంచి ఓపన స్కూల్ పరీక్షలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పదవ తరగతి పరీక్షలకు 538 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.