వటపత్రశాయి అలంకారంలో దశరథరాముడు
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:25 AM
ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం ఉదయం స్వామి వారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
సింహవాహనంపై సీతారామలక్ష్మణుల అభయం
ఒంటిమిట్ట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం ఉదయం స్వామి వారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సీతారామలక్ష్మణులు సింహవాహనంపై దర్శనం ఇచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
1న కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏప్రిల్ 1న జిల్లాకు రానున్నారని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఒంటిమిట్టకు చేరుకున్న ముఖ్యమంత్రి...సాయంత్రం 6.15గంటలకు కోదండ రామస్వామి వారికి ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం ఆలయ సమీపంలోని కల్యాణ వేదిక వద్దకు చేరుకుని, సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వామి వారికి ముత్యాల తలంబ్రాలను అందజేస్తారని కలెక్టర్ తెలిపారు.
ఒంటిమిట్ట కల్యాణానికి తిరుమల లడ్డూలు సిద్ధం
కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ఏప్రిల్ 1వ తేదీన జరిగే సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు 85 వేల తిరుమల లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారిసేవా సదన్-1లో 300మంది శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ను ఆదివారం టీటీడీ నిర్వహించింది.