Share News

‘ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లు!’ పై నివేదిక కోరిన ఆర్జేడీ

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:36 AM

‘ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లు’.. శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.

‘ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లు!’ పై నివేదిక కోరిన ఆర్జేడీ

  • అందజేసిన ప్రధానోపాధ్యాయురాలు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ముసునూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లు’.. శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఏలూరు జిల్లా ముసునూరు జూనియర్‌ కళాశాల నిర్వహణపై సమగ్ర నివేదిక అందజేయాలని విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నాగమణి.. ప్రధానోపాధ్యాయురాలు డి.శైలజను సోమవారం ఆదేశించడంతో ఆ మేరకు హెచ్‌ఎం పూర్తి వివరాలను నివేదికలో పొందుపర్చారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరంలో ముసునూరు జడ్పీ హైస్కూలును అప్‌గ్రేడేషన్‌ చేసి ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో బాలికల జూనియర్‌ కళాశాల (హైస్కూల్‌ ప్లస్‌)ను ప్రారంభించారు. మొదటి సంవత్సరం తొమ్మిది మంది విద్యార్థినులు చేరారు. బాలికలకు వసతి గృహం, రవాణా సౌకర్యం లేదని, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ లెక్చరర్లను వేరే హైస్కూల్‌ ప్లస్‌కు డిప్యూటేషన్‌ వేసిన కారణంగా విద్యార్థినులందరూ వేరే కళాశాలలో చేరినట్టు నివేదికలో పేర్కొన్నారు. మరుసటి విద్యా సంవత్సరంలో 12 మంది బాలికలు చేరగా, ఆంగ్ల మాధ్యమం కారణంగా వివిధ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారని, ఒకే ఒక విద్యార్థిని ఉత్తీర్ణత సాధించగా మిగిలిన 11 మంది కళాశాలకు రావడం మానేశారన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్లుగా బదిలీ అయ్యారని, ముగ్గురు బాలికలతో కళాశాల నడుపుతున్న క్రమంలో ఇద్దరు బాలికలు మానివేయగా ఫస్టియర్‌లో పాసయిన ఒకే ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలినట్టు తెలిపారు. ఈ విషయాన్ని నూజివీడు ఉప విద్యాశాఖ అధికారికి తెలిపామని, ప్రస్తుతం కళాశాలలో బైపీసీ రెండో సంవత్సరం ఒక విద్యార్థిని మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం ఏడు లెక్చరర్ల పోస్టులకు గానూ నలుగురే ప్రస్తుతం విధుల్లో ఉన్నట్టు నివేదించారు.

Updated Date - Feb 10 , 2026 | 04:36 AM