ఆన్‌లైన్ గేమ్స్‌కు దంపతులు బలి
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:30 AM
అప్పుల ఊబిలో కూరుకుపోయి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో ఘటన
గోస్పాడు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అప్పుల ఊబిలో కూరుకుపోయి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేకల శేషాద్రి(31), అంజిత (26)లకు మహేంద్ర(4), మోక్షిత(2) సంతానం. శేషాద్రి నంద్యాలలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న డబ్బుతో పాటు ప్రతి నెలా వచ్చే జీతాన్ని సైతం ఆన్‌లైన్ గేమ్స్‌లో పెట్టాడు. లాభాలు రాకపోవడంతో అత్యాశకు పోయి స్నేహితులు, తెలిసిన వారి వద్ద రూ.5 లక్షలకు పైగా అప్పులు చేశాడు. తండ్రి, మామ కొంత మేర ఆర్థిక సాయం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పులు అధికం కావడం, వడ్డీలు పెరిగిపోవడంతో పాటు రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికం అయ్యాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో శేషాద్రి, అంజిత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు బిడ్డలతో శనివారం రాత్రి కలసి భోజనం చేశారు. పిల్లలను పక్క గదిలో ఉంచి తలుపు వేశారు. మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి వరకు ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులు ఉదయాన్నే అచేతన స్థితిలో ఉండటాన్ని చూసి ఆ పసి హృదయాలు అల్లాడిపోయాయి.