Disaster Management: అదుపులోకి బ్లో ఔట్..!
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:19 AM
కోనసీమలో చెలరేగిన ‘బ్లో ఔట్’ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు తీవ్రం గా శ్రమిస్తున్నారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని.....
మూడు వైపుల నుంచి నీళ్లు వెదజల్లడంతో తగ్గుముఖం పడుతున్న మంటలు
అమలాపురం, రాజమహేంద్రవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కోనసీమలో చెలరేగిన ‘బ్లో ఔట్’ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు తీవ్రం గా శ్రమిస్తున్నారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్ వద్ద సోమవారం ఉవ్వెత్తు న ఎగసిపడిన మంటల తీవ్రత మంగళవారానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడి వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు అదుపులోకి వస్తున్నాయి.
నిపుణుల బృందాల రాక
ఢిల్లీ నుంచి డైరెక్టర్ టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసె్‌సకు చెందిన విక్రమ్ సక్సేనాతో సహా ఓఎన్జీసీ సీనియర్ మేనేజ్‌మెంట్, క్రైసిస్ మేనేజ్‌మెంట్(సీఎంటీ) బృందాలు ఓఎన్జీసీ మోరి-5 బావి వద్ద నియంత్రణ పనులు ప్రారంభించాయి. సమీపంలోని పంటకాల్వల నుంచి తాత్కాలికంగా కాల్వను తవ్వడం ద్వారా నీటిని సైట్ వద్దకు మళ్లిస్తున్నారు. సైట్ చుట్టూ చెరువుల మాదిరిగా తవ్వి అందులో అధిక సామ ర్థ్యం గల వాటర్ పంపులతో నీటిని మంటలపైకి వెదజల్లుతున్నారు. నిపుణుల బృందాలు బ్లో ఔట్ ప్రాంతం వద్ద 600 మీటర్ల పరిధిలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించారు. మంటలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో శబ్ధ కాలు ష్యం కూడా తగ్గింది. ఇరుసుమండ, చింతలపల్లి, లక్కవరం, గుబ్బలవారిపాలెం గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. దీంతో పునరావాస కేంద్రంలో ఉన్నవారు ఇళ్లకు చేరుతున్నారు. ఈ బ్లో ఔట్ రిగ్ వద్ద కాలిపోయిన శకలాల(డెబ్రిషన్)ను తొలగించడానికి ప్రత్యేక రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
మరో వారం రోజులు పట్టే అవకాశం
శకలాలు తొలగింపు తర్వాత బావి ముఖద్వారా న్ని శాండ్ కట్టర్ ద్వారా కట్ చేసి వెల్ క్యాపింగ్ ప్రక్రియ చేపడతారు. మంటల నియంత్రణకు 4 రోజులు పడుతుందని, వెల్ క్యాపింగ్ ప్రక్రియ వా రం రోజుల్లో పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహే్‌షకుమార్ మంగళవారం రాత్రి వెల్లడించారు.
ప్రణాళిక సిద్ధం: న్యూఢిల్లీలోని ఓఎన్జీసీ టెక్నికల్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనాతోపాటు ఓఎన్జీసీ సీనియర్ మేనేజ్‌మెంట్, ముంబై, డెహ్రాడూన్‌ల నుంచి క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్(సీఎంటీ) నిపుణులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఒకేసారి మంటలను అదుపు చేయడం వల్ల శాస్ర్తీయంగా, పర్యావరణపరంగా ఇబ్బందులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున గ్యాస్ లీక్ నియంత్రణ టీమ్‌ల సూచనల మేరకు క్రమంగా మంటలు అదుపుచేసే ప్రక్రియ నాలుగు రోజుల్లో పూర్తిచేయనున్నారు.
బాధితులు ఇబ్బంది పడకుండా చూడాలి
బ్లో ఔట్ పరిస్థితిపై సమీక్షలో సీఎం చంద్రబాబు
కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లో ఔట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఇళ్లు, ఊళ్లు వదిలినవారు ఇబ్బంది పడకుండా చూడాల్సి న బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని సూచించారు. మంటల వల్ల కొబ్బరిచెట్లు, పంట నష్టం జరిగిన వారికి పరిహారం అందించాలన్నారు. మంటలు అదుపు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సహాయాన్ని తీసుకుని త్వరితగతిన సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఓఎన్జీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామనే భరోసా ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.