ప్రభుత్వ సంస్థ వద్దు... ప్రైవేటే ముద్దు!
ABN , Publish Date - May 28 , 2026 | 05:14 AM
మంగంపేట బెరైటీస్ గనులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇక్కడ బెరైటీస్ మైనింగ్, నిర్వహణ, నియంత్రణ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చేతిలో ఉంది
బెరైటీస్ కాంట్రాక్టులో ఓఎన్‌జీసీ తీరిదీ
రాష్ట్ర ప్రభుత్వ జోక్యం కోరుతున్న నిపుణులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మంగంపేట బెరైటీస్ గనులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇక్కడ బెరైటీస్ మైనింగ్, నిర్వహణ, నియంత్రణ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చేతిలో ఉంది. ప్రైవేటు కంపెనీలు, పల్వరైజింగ్ మిల్లులు తమకు కావాల్సిన బెరైటీస్‌ను ఎండీసీ నుంచే కొంటాయి. అలాంటిది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) మాత్రం ప్రైవేటు కంపెనీలనే నమ్ముకుంటోంది. ఏటా వాటికి రూ.వందల కోట్ల టెండర్లు అప్పగిస్తూ నిలువునా మోసపోతోంది. 2018 వరకూ ఓఎన్‌జీసీ తమకు అవసరమైన బెరైటీస్ బీ-గ్రేడ్(4.10 రకం)ను ఏపీఎండీసీ నుంచే కొనుగోలు చేసేది. వెంకయ్యచౌదరి ఏపీఎండీసీ ఎండీగా ఉన్నంతవరకూ (2018) ఎండీసీనే సరఫరా చేసేది. అప్పట్లో బెరైటీస్ నాణ్యత, సరఫరాపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు రాలేదు. అవినీతి మరకలు అంటలేదు. అయితే, 2019 నుంచి సీన్ మారింది. వైసీపీ పెద్దలు రంగప్రవేశం చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి ప్రైవేటు కంపెనీల నుంచి బెరైటీస్ కొనుగోలు చేయించేలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఓ నేత ప్రోద్బలంతో కొన్ని కంపెనీలను సిండికేట్‌గా ఏర్పాటు చేయించి, వాటికే టెండర్ వచ్చేలా, అవి మాత్రమే బెరైటీస్‌ను సరఫరా చేసేలా వ్యూహం అమలు చేసి రూ.వందల కోట్ల దోచేశారు. కమీషన్లకు కక్కుర్తి పడిన కేంద్ర సంస్థలోని కొందరు ఉన్నత స్థాయి అధికారులు సహకరించారు. వీరి అండతో కొన్ని కంపెనీలు సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్, ఇంకా ఎందుకు పనికిరాని వేస్ట్‌పౌడర్‌ను సరఫరా చేశాయి. తాజాగా 2026-28 సంవత్సరాలకు సంబంధించి 2.82 లక్షల టన్నుల బీ-గ్రేడ్ బెరైటీస్ సరఫరా కోసం పిలిచిన రూ.340 కోట్ల టెండర్‌కు కూడా ప్రైవేటు కంపెనీలనే ఎంపిక చేశారు. ఈ కంపెనీలు గతంలోనూ ఓఎన్‌జీసీకి బెరైటీస్‌ను సరఫరా చేశాయి.
నిల్వ లేకుండా సరఫరా ఎలా?
మంగంపేటలో దాదాపు 70పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నింటి వద్ద ఉన్న నిల్వ 50వేల టన్నులకు మించదని ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ కంపెనీ లేదా మిల్లుకు నెలకు 140 టన్నుల బీ-గ్రేడ్ బెరైటీస్‌ను మాత్రమే ఏపీఎండీసీ అమ్ముతుంది. ఇలా ఒక కంపెనీ సంవత్సరానికి కొనగలిగే సరుకు 1,680 టన్నులు. ఈ లెక్కన ఓన్‌జీసీ టెండర్‌లో పాల్గొన్న పది కంపెనీలు కలిపి రెండేళ్లకు ఎండీసీ నుంచి కొనగలిగే బీ-గ్రేడ్ బెరైటీస్ 33,600 టన్నులు మాత్రమే. అలాంటిది రెండేళ్లలో 2.82 లక్షల టన్నుల సరుకు ఎలా సరఫరా చేస్తాయో అంతుపట్టడం లేదు. సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌లు కలిపి దాన్నే బీ-గ్రేడ్ కింద సరఫరా చేసి సొమ్ము చేసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గుట్టు వీడాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పరిశ్రమ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.5కోట్లు ఇస్తే అగ్రిమెంట్లు చేయిస్తా
కంపెనీలతో సిండికేట్ నడుపుతున్న ఓ కీలక వ్యక్తి మంత్రాంగం నడుపుతున్నారు. టెండర్ తమకే వస్తుందని, ఇతర కంపెనీలకు సబ్‌కాంట్రాక్టులు ఇస్తామని ఎర వేశారని తెలిసింది. బిడ్డింగ్‌లో పాల్గొన్న కంపెనీలు, మంగంపేటలోని మరికొన్ని సంస్థలు కలిపి తనకు రూ.5కోట్లు ఇస్తే బెరైటీస్ సరఫరా అగ్రిమెంట్ వ్యవహారం పూర్తి చేయిస్తానని ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. ఓఎన్‌జీసీ టెండర్‌పై మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం దృష్టి పెట్టకముందే డబ్బు సర్దుబాటు చేసుకొని ఒప్పందాలకు వెళ్లాలని ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు.