Konaseema District: ఆరిన మంటలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:32 AM
సంక్రాంతి పండుగ ముందు కోనసీమ ప్రజలను ఆందోళనకు గురిచేసిన బ్లో ఔట్ శనివారం మధ్యాహ్నానికి పూర్తిగా అదుపులోకి వచ్చింది.
అదుపులోకి కోనసీమ బ్లోఔట్.. ప్రివెంటర్ ఏర్పాటుతో కథ సుఖాంతం
ఆరు రోజుల్లో ఆపరేషన్ పూర్తి
నిర్విరామంగా పనిచేసిన ఓఎన్జీసీ నిపుణులు
కేరింతలతో ఫైర్ ఫైటర్స్ సంబరాలు
ఊపిరిపీల్చుకున్న స్థానిక ప్రజలు
ఇదో గణనీయమైన విజయం: ఓఎన్జీసీ
రిగ్ దగ్ధంతో రూ. కోట్లలో ఆస్తి నష్టం
పంట నష్టం లెక్కల్లో అధికారులు
అమలాపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ ముందు కోనసీమ ప్రజలను ఆందోళనకు గురిచేసిన బ్లో ఔట్ శనివారం మధ్యాహ్నానికి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు మంటలను ఆర్పి వేసి, గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టారు. రికార్డు టైంలో మంటలను నిలువరించామని, బ్లోఔట్ నియంత్రణల విషయంలో ఇదో గణనీయమైన విజయమని ఓఎన్జీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 5న డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ మోరి-5 బావిలో బ్లోఔట్‌తో భారీగా మంటలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఈ బావిలో డీప్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సంస్థ వర్క్ ఓవర్ రిగ్‌తో 2.7 కి.మీ. లోతులో డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ విస్ఫోటంతో తొలు త గ్యాస్ బయటకు వచ్చి మంచు మాదిరిగా పరిసర ప్రాంతాలను కప్పివేసింది. గంట వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు వంద మీటర్లకు పైబడి ఎగసిపడ్డాయి. దాంతో పరిసర గ్రామాల ప్రజలు భయకంపితులై ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సుమారు 500 మందికి పునరావాస చర్యలు చేపట్టింది.
మంటలు అదుపులోకి ఇలా..
బ్లోఔట్ విషయం తెలిసిన వెంటనే ఓఎన్జీసీ సీనియర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా, ఢిల్లీకి చెందిన క్రైసిస్ మేనేజ్మెంట్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. బ్లోఅవుట్ నియంత్రణకు వారు ప్రణాళికలు రచించారు. ముందుగా బ్లోఅవుట్ బావి వద్దకు ఒక ప్రత్యేక రోడ్డును నిర్మించారు. మంటలకు దగ్ధమైన రిగ్ శకలాలను మూడు రోజుల్లో తొలగించారు. వెల్ మౌత్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాటర్ అంబ్రెల్లాలతో నిరంతరాయంగా నీటిని వెదజల్లుతూ శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో బ్లోఅవుట్ మంటలను పూర్తిగా నిరోధించారు. మధ్యాహ్నం బ్లోఔట్ ప్రివెంటర్‌ను (బీవోపీ) వెల్ మౌత్ వద్ద అమర్చడంతో మంటలు, గ్యాస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయి. బ్లోఔట్ నియంత్రణ ఆపరేషన్ విజయవంతంగా కావడంతో ఓఎన్జీసీ నిపుణుల ఆనందానికి అవధుల్లేవు. విక్టరీ సంకేతాలు చూపుతూ, కేరింతలతో సంబరాలు చేసుకున్నారు. వారం రోజుల్లో మంటలను అదుపు చేస్తామని కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్, ఎంపీ గంటి హరీశ్ బాలయోగి సమక్షంలో వెల్లడించిన నిపుణులు ఒకరోజు ముందుగానే ఈప్రక్రియను ముగించడంతో పరిసర గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబోమని ఓఎన్జీసీ తన ప్రకటనలో వెల్లడించింది. భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
భారీగా ఆస్తి నష్టం.!
బ్లోఔట్ వల్ల సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ నిక్షేపాలు దగ్ధమయ్యాయి. రూ.కోట్ల విలువైన రిగ్ కాలిపోయింది. మంట ల్లో కాలిపోయిన కొబ్బరిచెట్లు, పంట నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు, ఆదివారం స్థానికులతో సమావేశం అనంతరం తుది లెక్కలు వేసి పరిహారం అందించనున్నారు. బ్లోఔట్ అదుపునకు నిరంతరాయంగా శ్రమించిన కలెక్టర్ మహే్‌షకుమార్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్‌ల కృషిని, ఏవిధమైన ప్రాణాపాయం లేకుండా మంటలను అదుపు చేసిన నిపుణులను స్థానికులు ప్రశంసించారు.