మళ్లీ అదే దోపిడీ!
ABN , Publish Date - May 27 , 2026 | 04:01 AM
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)కు ఇంటి దొంగలు మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. రూ.340 కోట్ల విలువైన బీ-గ్రేడ్ బెరైటీస్ పౌడర్ కొనుగోలు టెండర్లలో అంతర్గత బెంచ్‌మార్క్ (ఐబీఎమ్) విలువను ముందుగానే అస్మదీయ కంపెనీలకు లీక్ చేశారు!
ఓఎన్జీసీకి బెరైటీస్ సరఫరాలో భారీ గోల్‌మాల్
ప్రైవేటు కంపెనీలతో ఇంటి దొంగల కుమ్మక్కు
అంతర్గత బెంచ్‌మార్క్ విలువ అస్మదీయులకు లీక్?
రూ.340 కోట్ల టెండర్‌లో కంపెనీలకు 114 కోట్ల లాభం
మార్కెట్‌లో ముగ్గురాయి టన్ను ధర దాదాపు రూ.8,000
ప్రైవేట్ కంపెనీలకు ఏపీఎండీసీ సరఫరా చేసే రేటూ ఇదే
అయినా టన్నుకు 12,050 చొప్పున కోట్ చేసిన కంపెనీలు
సరిపడా నిల్వ లేకపోయినా లక్షల టన్నుల సరఫరాకు బిడ్‌లు
గతేడాదీ ఇదే తరహా దోపిడీని వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’.. ఇప్పటికీ పాఠాలు నేర్వని సంస్థ
సాధారణంగా ఏ సంస్థ అయినా ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా మార్కెట్ పరిశీలన చేస్తుంది. తాము కొనాలనుకున్న వస్తువు ధర ఇప్పుడు ఎంత ఉంది? గత కొన్నేళ్లలో ఏ ధరకు లభించింది? ఏ రేటుకు కొనాలి? అనే అంశాలపై అధ్యయనం చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీ ఇవేవీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కొన్నేళ్లుగా బెరైటీస్ పౌడర్ (ముగ్గురాయి పొడి)ను అధిక ధరకు కొనుగోలు చేస్తూ భారీగా నష్టపోతోంది. ఈ ఏడాది పిలిచిన టెండర్లలోనూ అదే కథ పునరావృతమైంది. సరఫరా కంపెనీలతో ఇంటి దొంగలు కుమ్మక్కవడంతో కేంద్ర సంస్థకు మరోసారి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లనుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)కు ఇంటి దొంగలు మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. రూ.340 కోట్ల విలువైన బీ-గ్రేడ్ బెరైటీస్ పౌడర్ కొనుగోలు టెండర్లలో అంతర్గత బెంచ్‌మార్క్ (ఐబీఎమ్) విలువను ముందుగానే అస్మదీయ కంపెనీలకు లీక్ చేశారు! దీంతో టెండర్ విలువపై సరిగ్గా రూపాయి తేడాతో కొన్ని కంపెనీలు, 20 పైసల నుంచి 70 పైసల తేడాతో మరికొన్ని కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. దీనివెనుక సంస్థలోని పైస్థాయి అధికారులు ఉన్నారని తెలుస్తోంది. బిడ్డింగ్‌లో ముందువరుసలో నిలిచిన కంపెనీలు సగటున ఒక టన్ను బీ-గ్రేడ్ బెరైటీస్ పౌడర్‌కు సుమారు రూ.4వేలు చొప్పున అధిక ధరను కోట్ చేశాయి. మొత్తం 2.82 లక్షల టన్నుల పౌడర్ కొనుగోలు కోసం పిలిచిన ఈ టెండర్‌ను యథాతథంగా ఆమోదిస్తే ఓఎన్‌జీసీకి అధికారికంగానే రూ.114 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీ-గ్రేడ్‌కు బదులుగా సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ పౌడర్‌ను మిక్స్‌చేసి సరఫరా చేయడం వల్ల వచ్చేనష్టం మరింతగా ఉంటుందని పేర్కొంటున్నాయి. గత ఐదే ళ్లలో పిలిచిన టెండర్లలో ఓఎన్‌జీసీకి రూ.వందల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన వైనాన్ని గతేడాది జనవరి 7న ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దానినుంచి కేంద్ర సంస్థ గుణపాఠాలు నేర్వకపోవడంతో ఇప్పుడు మరో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది.
ముగ్గురాయి పొడికి డిమాండ్
ఓఎన్‌జీసీ దేశవ్యాప్తంగా చమురు, గ్యాస్ నిక్షేపాలను గుర్తించి, తవ్వకాలు చేపడుతుంది. చమురు నిల్వలను వెలికితీసే క్రమంలో భూమి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. దీన్ని చల్లబర్చడానికి ఉత్ర్పేరకంగా బెరైటీస్ పౌడర్ (ముగ్గురాయి పొడి) చల్లుతారు. ఈ క్రమంలో చమురు బావుల తవ్వకంలో ముగ్గురాయి పొడి కీలకంగా మారింది. బెరైటీస్ ఏ, బీ, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌లు అని పలు రకాల్లో ఉంటుంది. ఇందులో బీ-గ్రేడ్‌లోని 4.10 రకాన్ని ఆయిల్ కంపెనీలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాయి. ఆయిల్ ఇండియా కార్పొరేషన్, ఓఎన్‌జీసీ సంస్థలు ఒకేసారి రెండేళ్ల అవసరాలకు సరిపోయేలా లక్షల టన్నుల ముగ్గురాయిని కొనుగోలు చేస్తాయి. ఇందులో భాగంగా 2026-27, 2027-28 సంవత్సరాలకు గాను 2.82 లక్షల టన్నుల బీ-గ్రేడ్(4.10 రకం) బెరైటీస్ పౌడర్ సరఫరా కోరుతూ ఓఎన్‌జీసీ ఇటీవల టెండర్లు పిలిచింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టన్ను బీ-గ్రేడ్(4.10) బె రైటీస్ విలువ రూ.7.200. దాన్ని పౌడర్‌గా మార్చడానికయ్యే ఖర్చు మరో రూ.800 కాగా, ప్యాకింగ్ ఖర్చు రూ.100. సగటున టన్ను బీ- గ్రేడ్ బెరైటీస్ పౌడర్ మార్కెట్‌లో రూ.7,900 నుంచి రూ.8,000కు లభిస్తోంది. ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు ఏపీఎండీసీ సైతం ఇదే ధరకు సరఫరా చేస్తోంది. కానీ, ఓఎన్‌జీసీ టెండర్లలో కంపెనీలు టన్ను రూ.12,050కు కోట్ చేశాయి. ఇది మార్కెట్ విలువ కంటే రూ.4వేలు అధికం. బిడ్డింగ్‌లో ముందువరసలో ఉన్న కంపెనీలన్నీ ఇంచుమించుగా ఇదే ధరను కోట్ చేయడం గమనార్హం. దీంతో ఓఎన్‌జీసీకి తీవ్ర నష్టం వాటిల్లనుండగా, వ్యాపారులకు మాత్రం కాసుల పంట పండనుంది. కేంద్ర సంస్థలోని కొందరు పైస్థాయి అధికారులకు విషయం తెలిసినా మౌనముద్ర వహించారని, అందుకే వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి స్వల్ప తేడాతోనే బిడ్‌లు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.
కల్తీ సరుకు సరఫరా!
దేశీయంగా బెరైటీస్ మైనింగ్‌లో సింహభాగం మంగంపేటలో జరుగుతుంది. దాన్ని ఏపీఎండీసీ పర్యవేక్షిస్తోంది. ఏ కంపెనీ అయినా సరే ముగ్గురాయిని ఏపీఎండీసీ నుంచే కొనుగోలు చేయాలి. కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. గత రెండేళ్లలో కంపెనీలు, సంస్థలు ఏపీఎండీసీ నుంచి 18వేల టన్నుల బీ-గ్రేడ్ బెరైట్‌ను కొన్నాయి. దాన్ని పౌడర్‌గా మార్చినా మహా అయితే మరో ఐదారు వేల టన్నుల నిల్వ ఉంటుంది. మరి 2.82లక్షల టన్నుల నాణ్యమైన బీ-గ్రేడ్(4.10) బెరైటీస్‌ను ఎక్కడినుంచి సమకూర్చుకొని పౌడర్‌గా మార్చి, ఓఎన్‌జీసీకి సరఫరా చేస్తాయన్నదే అతిపెద్ద ప్రశ్న. అంటే, బీ-గ్రేడ్ పేరిట కారుచౌకగా లభించే సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌లను మిక్స్‌చేసి సరఫరా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడూ అదే చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు, వ్యాపారులు, పల్వరైజింగ్ యూనిట్లు, మిల్లుల వద్ద సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ నిల్వ భారీగానే ఉంది. ఈ కల్తీ ముగ్గురాయి సరఫరాతో వచ్చే లాభం మరింతగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇన్ని అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఓఎన్‌జీసీ అధికారులు ఏ ప్రాతిపదికన ఈ టెండర్లను ఖరారు చేస్తారు? బిడ్డింగ్‌లో ముందు వరసలో ఉన్న కంపెనీలతో ఏ విధంగా సరఫరా ఒప్పందం చేసుకుంటారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతస్థాయి అధికారుల చర్యలు ఓఎన్‌జీసీని దోపిడీకి గురిచేసేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.