ఎట్టకేలకు.. ఒక్కరోజు!
ABN , Publish Date - May 05 , 2026 | 04:51 AM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్‌పై కాకినాడలోని స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
అనంతబాబు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి
కాకినాడ, మే 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్‌పై కాకినాడలోని స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఆయన్ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతబాబును 3 రోజుల పాటు విచారణ కోసం అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. కనీసం 2 రోజులైనా ఇస్తారని పోలీసులు భావించినా న్యాయమూర్తి మాత్రం ఒక్కరోజే అనుమతించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అనంతబాబును మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కాకినాడ తీసుకురానున్నట్టు దర్యాప్తు అధికారి, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు విచారణ చేపట్టనున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సర్పవరం పోలీసు స్టేషన్ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, అనంతబాబుపై దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పటికే నమోదయ్యాయి. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని ఆయన బెదిరించి, నిర్బంధించిన నలుగురు యువకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఈ కేసులో ఉన్నవారందరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ఆ ఇద్దరూ ఏమైనట్టు..?
సాక్షులను బెదిరించిన కేసులో ఏ2, ఏ3గా ఉన్న కడియాల చిన్నబాబు, కడియాల సతీశ్ ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. దాదాపు 15 రోజులుగా వారు పరారీలోనే ఉన్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వారిని పట్టుకోవడం కష్టంగా ఉందని చెబుతున్నారు. వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిచి విచారించినా ఆచూకీ లభ్యం కావడం లేదని అంటున్నారు.