ఒకే పాలసీ.. రెండు దారులు
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:33 AM
మద్యం షాపుల పాలసీ ఒక్కటే అయినా.. లైసెన్సీల ఎంపిక రెండు విధానాలు. ఎక్సైజ్ శాఖ మొదటిసారి ఇలా రెండు పద్ధతుల్లో పాలసీని ప్రకటించింది. తొలుత ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్ అవకాశం ఇచ్చింది
రెన్యువల్, లాటరీతో మద్యం పాలసీ
ఇలాంటిది అమలు ఇదే తొలిసారి
ప్రభుత్వ విధానంపై
వ్యాపారుల జిమ్మిక్కులు
కావాలనే రెన్యువల్ చేసుకోకుండా లాటరీకి
తక్కువ మొత్తంతో షాపు
దక్కించుకోవాలని ప్లాన్
కొన్నిచోట్ల పోటీ తీవ్రం.. సీన్ ‘రివర్స్’!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మద్యం షాపుల పాలసీ ఒక్కటే అయినా.. లైసెన్సీల ఎంపిక రెండు విధానాలు. ఎక్సైజ్ శాఖ మొదటిసారి ఇలా రెండు పద్ధతుల్లో పాలసీని ప్రకటించింది. తొలుత ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్ అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో 3650 షాపులు ఉండగా, 2843 షాపులను లైసెన్సీలు రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన 807 షాపులకు లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేసేందుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. సిండికేట్ అయ్యే వ్యాపారులు ఈ సారి రెండు విధానాలు ఉండటంతో కొత్త జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా అయితే ప్రభుత్వం కొత్త పాలసీ అంటే.. లాటరీ లేదా వేలం విధానం ప్రకటించాలి. కానీ వ్యాపారులకు నష్టాలు వచ్చాయనే వాదన ఉండటంతో రెన్యువల్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందుకోసం పాలసీకి ముందు లైసెన్సీలతో ఒకట్రెండు సమావేశాలు నిర్వహించగా ఎక్కువ మంది రెన్యువల్‌కు అంగీకారం తెలిపారు. అయితే పాలసీ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా కొందరు లైసెన్సీలు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. నిబంధనల ప్రకారం రెన్యువల్ చేసుకోవాలంటే ఏడాది లైసెన్స్ ఫీజులో 38 శాతం రెన్యువల్ పన్నుగా చెల్లించాలి. నగరాల్లో ఇది రూ.35.5 లక్షలుగా ఉంది. అదే రెన్యువల్ చేసుకోకుండా లాటరీకి వెళ్తే రూ.12 లక్షలతో సరిపోతుందని కొందరు ప్లాన్ వేశారు. లాటరీ తీసే షాపులకు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన ఉంది. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చొప్పున నాలుగు దరఖాస్తులకు మొత్తం రూ.12 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని, అదే రెన్యువల్‌కు రూ.35 లక్షలకు పైగా చెల్లించాల్సి వస్తుందని.. ఇలా ఉద్దేశపూర్వకంగా పాలసీని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేశారు.
అయితే లాటరీలో పోటీ ఎక్కువ ఏర్పడితే డబ్బులు పెట్టినా షాపు దక్కుతుందన్న గ్యారెంటీ ఉండదు. అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు మండలంలోని ఓ షాపునకు 33 దరఖాస్తులు ఎన్‌రోల్ చేశారు. విజయవాడలో పలు షాపులకూ పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల ఎన్ని దరఖాస్తులు వేసినా చివరికి షాపు వస్తుందన్న నమ్మకం ఉండదు. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన వ్యాపారులే బొక్కబోర్లా పడతారని అధికారులు భావిస్తున్నారు.
కొనుగోళ్లు చేసిన వారికి చిక్కులు
గత పాలసీ సమయంలో కొందరు లైసెన్సీలు ఇతరుల నుంచి లైసెన్స్‌లు అనధికారికంగా కొనుగోళ్లు చేశారు.ఇప్పుడు వాటిని రెన్యువల్ చేసుకోవాలంటే మళ్లీ అసలు లైసెన్సీకి నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు రెన్యువల్‌కు ముందుకు రాలేదు.